అజ్ఞాతంలో మావోళ్లు!
దుబ్బాక: ఆపరేషన్ కగార్‌తో చోటుచేసుకుంటున్న సంఘటనలతో అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టుల కుటుంబీకులు, బంధువులు ఆందోళన చెందుతున్నారు. నక్సలైట్ ఉద్యమానికి ఊపిరిపోసిన ఉమ్మడి మెదక్‌జిల్లాలో ఆపరేషన్ కగార్ మొదలైనప్పటినుంచి ఆందోళనకర పరిస్థితే నెలకొంది. భౌగోళికంగా ఉమ్మడి మెదక్‌జిల్లా ఉత్తర, దక్షిణ తెలంగాణకు సరిహద్దులో ఉండటంతో నక్సలైట్ ఉద్యమానికి కేంద్రబింధువుగా మారింది.
ఇటీవలనే రాంచంద్రారెడ్డి ఎన్‌కౌంటర్
40 రోజుల క్రితం జరిగిన ఎన్‌కౌంటర్‌లో కోహెడ మండలం తీగలకుంటపల్లికి చెందిన కట్టా రాంచంద్రారెడ్డి మృతిచెందాడు. ఆయన మూడున్నర దశబ్దాల క్రితం ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ ఉద్యమంలో చేరారు. 20 రోజుల క్రితం ధూళ్మిట్ట మండలం కూటిగల్‌కు చెందిన కూకటి వెంకన్న ఉద్యమజీవితాన్ని విడిచి జనజీవన స్రవంతిలో చేరారు. అలాగే దుబ్బాక మండలం చిట్టాపూర్‌కు చెందిన సోలిపేట కొండల్‌రెడ్డి ఎన్‌కౌంటర్‌లో మరణించగా, ఏఓబీ ఇన్‌చార్జి, సెంట్రల్ కమిటీ సభ్యుడు దౌల్తాబాద్ మండలం చెట్లనర్సంపల్లికి చెందిన దుభాషి శంకర్ ఆలియాస్ రమేష్ అరెస్టయి ఒడిశా సెంట్రల్ జైల్‌లో ఉన్నారు. అలాగే రుద్రారం గ్రామానికి చెందిన జనశక్తి కేంద్రకమిటీ సభ్యుడు సుభాష్, మల్లుపల్లికి చెందిన సంజీవ్‌తో పాటు కీలకనాయకులు ఎన్‌కౌంటర్లలో అమరులయ్యారు.
వరుస సంఘటనలతో బెంగ
వరుస సంఘటనలతో ఎప్పుడు ఏం జరుగుతుందో? ఏం వార్త వినాల్సివస్తుందోనని అజ్ఞాతంతో ఉన్న భాగ్య, స్వరూప, అరుణ కుటుంబీకులు, బంధువులు కలవరం చెందుతున్నారు.
● మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామానికి చెందిన రంగబోయిన భాగ్య అలియాస్ కల్పన. రూపి పేరుతో మావోయిస్టు పార్టీలో 25 ఏళ్లుగా వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. ప్రస్తుతం నార్త్‌బస్తర్ ప్రతాపూర్ ఏరియా కమాండర్‌గా పనిచేస్తున్నట్లు సమాచారం.
● నంగునూరు మండల కేంద్రానికి చెందిన రంగు అరుణ అలియాస్ పద్మక్క 30 ఏళ్లుకు పైగా మావోయిస్టు పార్టీలో అజ్ఞాతంలో ఉన్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ యాక్షన్ టీంలో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.
● అక్కన్నపేట మండల కేంద్రానికి చెందిన కాశబోయిన స్వరూప పదో తరగతి చదువుతున్న క్రమంలోనే ఉద్యమబాట పట్టారు. 30 ఏళ్ల క్రితమే ఉద్యమబాట పట్టిన స్వరూప దండకారణ్యంలో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు.
వరుస ఎన్‌కౌంటర్లు.. అరెస్టులతో కుటుంబసభ్యుల్లో ఆందోళన
మావోయిస్టు ఉద్యమంలో ముగ్గురు మహిళలు కీలక పాత్ర
అజ్ఞాతంలో మావోళ్లు!


