చిట్టి చేతులు..ఎన్నెన్నో అద్భుతాలు
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో బుధవారం నిర్వహించిన ఇన్‌స్పెయిర్, సైన్స్ ఎగ్జిబిషన్ సంబురంగా కొనసాగింది. విద్యార్థులు వినూత్న ఆలోచనలతో నూతన ఆవిష్కరణలను ప్రదర్శించారు. నిత్యం అందుబాటులో ఉండే పరికరాలతో ప్రాజెక్టులను రూపొందించడం విశేషం. ప్రదర్శనలు చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అందులో కొన్ని ప్రాజెక్టుల గురించి తెలుసుకుందాం..
ఇంటెలిజెన్స్ చలాన్ సిస్టమ్ ఆన్ రోడ్
ఈ ప్రాజెక్టును జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గుర్రాలగొంది విద్యార్థి శ్రావ్య రూపొందించారు. ఈ సిస్టమ్ ద్వారా ట్రాఫిక్‌ను కంట్రోల్ చేయడం, నిబంధనలు పాటించని వాహనాలకు చలాన్ వేయడం ఆటోమెటిక్‌గా జరుగుతుంది. ఒక వేళ వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే సిగ్నల్ పై ఉన్న కెమెరా ద్వారా ఫొటో తీసి, ఆటోమెటిక్‌గా వాహనంపై చలాన్ జనరేట్ అవుతుంది. దీంతో వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించే అవకాశం ఉంది.
పవర్ ప్రొడక్షన్..
పవర్ ప్రొడెక్షన్ ప్రాజెక్టును జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇందిరానగర్ విద్యార్థులు లక్షిత్, యోగినాథ్‌లు రూపొందించారు. ఈ ప్రాజెక్టులో ముఖ్యంగా సోలార్ పలక ద్వారా విద్యుత్‌ను జనరేట్ చేసి విద్యుత్ సరఫరా చేయడం. సోలార్ పలకలు కేవలం ఏ విధంగా అమర్చితే అలాగే ఉంటాయి. కానీ ఈ ప్రాజెక్టులో మాత్రం వెలుతురు ఏ దిక్కున ఉంటే, ఆ దిక్కుకు సోలార్ పలకలు మారుతాయి. దీంతో నిరంతరం విద్యుత్‌ను పొందే అవకాశం ఉంటుంది. చిన్న బల్బుల పై వెలుతురు పడగానే సెన్సార్ సిస్టం ద్వారా సోలార్ పలకలు వెలుతురు వైపునకు మరలుతాయి. దీంతో విద్యుత్ అధికంగా ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది.
ఆటోమెటెడ్ ఫెర్టిలైజర్ డిస్పెన్సింగ్ సిస్టమ్
ఈ ప్రాజెక్టును లచ్చపేట ఆదర్శపాఠశాల విద్యార్థి ఎండీ అజీజ్ రూపొందించాడు. ఈ పరికరంలో గేర్ మోటారు, ఎరువు, రసాయనాలు వేసే బాక్స్, సోలార్ పలక, సెన్సార్ రిసీవర్, నీటిమోటారు, సెల్‌ఫోన్, పైపులు, బ్యాటరీలను ఉపయోగించారు. సెల్‌ఫోన్ సహాయంతో సెన్సార్ రిసీవర్‌ను కంట్రోల్ చేస్తారు. సెల్‌ఫోన్‌తో సెన్సార్‌కు సమాచారం అందించగానే ఈ పరికరం పని చేస్తుంది. సోలార్ విద్యుత్ శక్తి ద్వారా పంట చేనులో ప్రయాణిస్తుంది. పరికరానికి అమర్చిన పైపుల ద్వారా పంట చేనులో ఎరువులు, రసాయనాలు పిచికారీ చేస్తారు. తక్కువ ఖర్చుతో ఈ పరికరం పంట చేనులో రైతులకు శ్రమ లేకుండా వినియోగించే అవకాశం ఉంది.
వినూత్న ఆలోచనలతో నూతన ఆవిష్కరణలు
సంబురంగా ఇన్‌స్పెయిర్, సైన్స్ ఎగ్జిబిషన్
తరలివచ్చిన వేలాదిమంది విద్యార్థులు
చిట్టి చేతులు..ఎన్నెన్నో అద్భుతాలు
చిట్టి చేతులు..ఎన్నెన్నో అద్భుతాలు


