రియల్‌ నయా దందా | - | Sakshi
Sakshi News home page

రియల్‌ నయా దందా

Nov 20 2025 10:44 AM | Updated on Nov 20 2025 10:44 AM

రియల్‌ నయా దందా

రియల్‌ నయా దందా

సాక్షి, సిద్దిపేట: జిల్లాలో రియల్టర్లు కొత్త దందాకు తెరలేపారు. ప్రజలల్లో కొనుగోలు శక్తి తగ్గడంతో ఇళ్లు, ప్లాట్లు, సాగు భూములు అమ్ముడుపోవడం కష్టంగా మారింది. దీంతో యజమానులు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు ఎలాగైనా భూములు, ఇళ్లు అమ్మి సొమ్ము చేసుకోవాలన్న లక్ష్యంతో కొత్త పద్ధతిని ఎంచుకున్నారు. రూ.500 నుంచి రూ.2వేల విలువ చేసే కూపన్లు విక్రయించి లక్కీ డ్రాల ద్వారా ఇళ్లు, ప్లాట్లు అందించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇలా సులువుగా డబ్బులు సంపాదించి కస్టమర్లను బోల్తా కొట్టించి భూములను వదిలించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కాస్త జిల్లా వ్యాప్తంగా ప్రచారం కావడంతో అమాయకులు లక్కీ డ్రాలో పాల్గొని మోసపోయే అవకాశాలున్నాయి. దీనిని ఆరంభంలో కట్టడి చేస్తే ప్రజలు మోసపోకుండా ఉండే అవకాశం ఉంది. ఈ లక్కీ డ్రాలపై పోలీసులు, రెవెన్యూ అధికారులు దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.

సోషల్‌ మీడియా వేదికగా

దసరా, దీపావళి, రంజాన్‌, క్రిస్మస్‌ పండుగల నేపథ్యంలో షాపింగ్‌ చేసిన వారికి వివిధ బహుమతులు అందజేసేందుకు పెద్ద పెద్ద బట్టల షాపులు, ఎలక్ట్రానిక్స్‌ వారు లక్కీ డ్రాలు నిర్వహిస్తారు. దీనికి వినియోగదారుల నుంచి స్పందన ఎక్కువగానే ఉంటుంది. రియల్‌ఎస్టేట్‌ వ్యాపారులు ఇదే పద్ధతిలో రూ.500 నుంచి రూ.2వేలకే లక్షల విలువ చేసే ఇల్లు, ప్లాట్‌ తమ సొంతం చేసుకోవచ్చని సోషల్‌ మీడియా వేదికగా ప్రచారం చేసి ప్రజలను ఆకర్షిస్తున్నారు. జగదేవ్‌పూర్‌, ములుగు మండలాల పరిధిలో ఎక్కువగా ఇళ్లు, ప్లాట్లు లక్కీ డ్రా దందా కొనసాగుతోంది. ఆన్‌లైన్‌లో సైతం ఈ ఫోన్‌ నంబర్‌కు డబ్బులు పంపిస్తే పేరు రాసి డ్రాలో వేస్తామంటూ ప్రచారం చేస్తున్నారు. లక్కీ డ్రాలకు సంబంధించిన వీడియో, కరపత్రాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. వీటిని ప్రజలు చూసి నయా ట్రెండ్‌ వైపు ఆకర్షితులవుతుండటం గమనార్హం.

ప్రత్యేకంగా ఏజెంట్ల నియామకం

ఒక్కో దానిపై వేలాది మందిని సభ్యులుగా చేర్చుకొని రూ.లక్షలు వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకొని ఆ దిశగా పావులు కదుపుతున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఏజెంట్లను నియమించుకొని సభ్యులను చేర్చుతున్నట్లు తెలుస్తోంది. డబ్బులు వసూలు చేసిన తర్వాత నిర్వాహకులు చేతులు ఎత్తేస్తే పరిస్థితి ఏమిటని, ఇలాంటి వాటికి చట్టంలో అనుమతులు ఉన్నాయా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇలా మోసం చేస్తే లక్కీ డ్రాలో డబ్బులు కట్టిన వారి పరిస్థితి ఏమిటని పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. లక్కీ డ్రా పేరుతో డబ్బులు వసూలు చేసిన తర్వాత ఒప్పందం మేరకు భూములు చేతులు మారకపోతే ఎలా? అన్నది సైతం ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

ప్రారంభంలోనే నిలువరించాలి

రాష్ట్రంలో లాటరీలకు అనుమతి లేదు. ఇళ్లు, భూముల లక్కీ డ్రా అంశం రెవెన్యూ, పోలీసులకు తెలిసినా పట్టించుకోవడంలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. లక్కీ డ్రాలు ప్రారంభంలోనే అధికారులు కట్టడి చేస్తేనే ప్రజలు మోసపోకుండా ఉండే అవకాశాలున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.

లక్కీ డ్రా కూపన్‌

ఒక్కో కూపన్‌ రూ.500 నుంచి రూ.2వేలు వసూలు

జగదేవ్‌పూర్‌, ములుగు ప్రాంతాల్లో ఇష్టారాజ్యం

కట్టడి చేయాలంటున్న ప్రజలు

అలా చేయడం చట్ట విరుద్ధం

మనీ సర్క్యూలేషన్‌ 1978 యాక్ట్‌ కింద లక్కీ డ్రాలు నిర్వహించడం చట్ట విరుద్ధం. ఎవరు ప్రయోట్‌ చేయవద్దు. ఎవరూ డబ్బులు చెల్లించవ వద్దు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకుంటాం.

– విజయ్‌కుమార్‌, సీపీ, సిద్దిపేట

ఇల్లు.. ప్లాట్‌.. లక్కీ డ్రా అంటూ రియల్టర్ల మాయాజాలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement