పొద్దు తిరుగుడుకు ప్రోత్సాహం
పొద్దు తిరుగుడు పంటను ప్రోత్సహించడానికి వ్యవసాయశాఖ చర్యలు చేపట్టింది. ఈసారి కొత్తగా నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ (జాతీయ నూనె గింజల పథకం) కింద వందశాతం సబ్సిడీపై విత్తనాలు అందిస్తున్నారు. సిద్దిపేట జిల్లాలో 6,250 ఎకరాల్లో సాగు లక్ష్యంగా 160క్వింటాళ్ల మేర పంపిణీ చేయనున్నారు. సంగారెడ్డి, మెదక్ జిల్లాలోనూ విత్తన పంపిణీ చేపడుతున్నారు.
గజ్వేల్: ఉమ్మడి మెదక్ జిల్లా (సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్)లో ఏటా యాసంగిలో 6 లక్షల మేర పంటలు సాగులోకి వస్తాయి. ఇందులో సింహభాగం వరి సాగులోకి వస్తుండగా.. ఆరుతడి పంటలను రైతులు భారీగానే సాగు చేస్తారు. ఆరుతడిలో ముఖ్యమైన పొద్దు తిరుగుడు పంటకు ఈసారి వంద శాతం విత్తన సబ్సిడీ అందజేస్తున్నారు. నూనె గింజల పంటల సాగును ప్రోత్సహించాలనే లక్ష్యంతో చర్యలు చేపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం జాతీయ నూనె గింజల పథకం కింద ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. సిద్దిపేట జిల్లాలో ఇప్పటికే పంపిణీ ప్రక్రియ మొదలయ్యింది. జిల్లాలో 6,250 ఎకరాల్లో పొద్దు తిరుగుడు పంటను సాగు చేయడమే లక్ష్యంగా ముందుకుసాగుతున్నారు. ఎకరాకు 2.5కిలోల విత్తనం అవసరముంటుంది. ఈ క్రమంలోనే జిల్లాకు 160క్వింటాళ్ల మేర విత్తనం వచ్చింది. జిల్లాలోని పొద్దు తిరుగుడు పంటను సాగు చేసే మండలాలను గుర్తించి పంపిణీ చేపడుతున్నారు.
మహిళల భాగస్వామ్యం..
ఉమెన్ ఫార్మర్స్ ప్రొడ్యుసింగ్ ఆర్గనైజేషన్‌ల ఆధ్వర్యంలో పంపిణీ చేస్తున్నారు. విత్తన పంపిణీలో మహిళలను భాగస్వాములను చేయడమే లక్ష్యంగా ముందుకుసాగుతున్నారు. జిల్లాలోని అన్ని వ్యవసాయ డివిజన్‌లలో ఈ పంపిణీ ప్రక్రియ జోరుగా సాగుతోంది. మున్నెన్నడూలేని విధంగా వందశాతం సబ్సిడీపై పొద్దు తిరుగుడు విత్తనాలు అందజేస్తుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లోనూ 10వేల ఎకరాల సాగు లక్ష్యంగా చర్యలు చేపడుతున్నారు.
నూనె గింజల సాగు పెంపే లక్ష్యం
నూనె గింజల సాగును ప్రోత్సహించడమే లక్ష్యం. ఈసారి పొద్దు తిరుగుడు విత్తనాలను వందశాతం సబ్సిడీపై పంపిణీ చేస్తున్నాం. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ ఈ కార్యక్రమం సాగుతోంది. కొన్ని జిల్లాల్లో వేరుశనగ విత్తనాలను సైతం అందిస్తున్నారు. రైతుల నుంచి మంచి స్పందన లభిస్తోంది.
– స్వరూపరాణి,
జిల్లా వ్యవసాయాధికారి
వందశాతం సబ్సిడీపై విత్తనాలు
జిల్లాలో 6,250ఎకరాలసాగు లక్ష్యం
సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లోనూ పంపిణీకి చర్యలు
పొద్దు తిరుగుడుకు ప్రోత్సాహం


