భూ సేకరణ వేగిరం చేయండి
● కలెక్టర్ హైమావతి
● అధికారులు, రైతులతో సమావేశం
సిద్దిపేటరూరల్: రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ ఆర్) నిర్మాణంలో భాగంగా భూ సేకరణను వేగిరం చేయాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్‌లోని మీటింగ్ హాల్‌లో అధికారులు, మర్కూక్, వర్గల్ మండలాల రైతులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ట్రిపుల్ ఆర్‌లో భూమిని కోల్పోతున్న బాధిత రైతులకు ప్రభుత్వపరంగా అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలిపారు. ప్రజా అవసరాల కోసం భూమిని త్యాగం చేస్తున్న మీకు దక్కాల్సిన నష్టపరిహారం అందేలా చూస్తామన్నారు. భూమిని త్వరగా అందించేందుకు రైతులు ముందుకు రావాలని సూచించారు.
పారదర్శకంగా చీరల పంపిణీ
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ చీరల పంపిణీ జిల్లాలో పూర్తి పారదర్శకంగా జరిగేలా కృషి చేయాలని కలెక్టర్ హైమావతి సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంత్రులతో కలిసి సచివాలయం నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ‘మహిళల ఉన్నతి – తెలంగాణ ప్రగతి’ కార్యక్రమం పేరుతో ఇందిరమ్మ చీరల పంపిణీకి చర్యలు తీసుకున్నామన్నారు. చీరల పంపిణీ కార్యక్రమం పర్యవేక్షణ కోసం నియోజకవర్గానికి ఒకరు స్పెషల్ ఆఫీసర్‌ను నియమిస్తున్నామని అన్నారు. ప్రజా ప్రతినిదుల సమక్షంలో చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టి నిర్ణీత గడువు లోపు ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, డీఆర్డీఓ జయదేవ్ ఆర్య, డీపీఓ వినోద్ కుమార్, జిల్లా మహిళా సమైక్య అధ్యక్షురాలు టి. రేణుక, మున్సిపల్ కమిషనర్లు, మహిళా సమాఖ్య ప్రతినిధులు, ఏపీవోలు, తదితరులు పాల్గొన్నారు.
నాణ్యమైన ఆహార పదార్థాలే వాడాలి
కొమురవెల్లి(సిద్దిపేట): హాస్టళ్లలో నాణ్యమైన ఆహారపదార్థాలతో రుచికరమైన వంటకాలను తయారు చేయాలని కలెక్టర్ హైమావతి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని కేజీబీవీని ఆకస్మికంగా సందర్శించారు. స్టోర్ రూంలో ఉన్న కూరగాయలను, వంట సామగ్రిని, రాత్రిభోజనాన్ని పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ మెనూ ప్రకారం కూరలు వండాలన్నారు. ఎలాంటి సాకులు చెప్పొద్దని సిబ్బందికి సూచించారు. పిల్లలందరికీ సరిపోయేలా వండాలని వంట సిబ్బందిని ఆదేశించారు.


