రాజకీయాలు కావు.. సేవలు గొప్పవి
● వైద్య కళాశాలకు మదన్ మోహన్ పేరు
● ప్రభుత్వానికి లేఖ రాసి, కృషి చేస్తా
● మాజీ మంత్రి హరీశ్‌రావు
సిద్దిపేటజోన్: ‘రాజకీయాలు, వ్యక్తులు గొప్ప కాదు, నాయకులు చేసిన సేవ, కృషి గొప్పవి. మాజీ ఎమ్మెల్యే మదన్ మోహన్ గొప్ప నాయకుడు’ అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. మదన్ మోహన్ 93వ జయంతి సందర్భంగా ఆదివారం స్థానిక విక్టరీ టాకీస్ చౌరస్తా పార్కులో కుటుంబ సభ్యులతో కలిసి మదన్ మోహన్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. తొలిదశ ఉద్యమానికి మొట్టమొదటి ఉప ఎన్నిక సిద్దిపేట అని, ఈ ప్రాంత ప్రజలు తెలంగాణ కావాలని మదన్ మోహన్‌కు పట్టం కట్టారన్నారు. మలి దశ ఉద్యమంలో సిద్దిపేట కేసీఆర్‌కు పట్టం కట్టారని వివరించారు. సిద్దిపేట ప్రజలు చాలా గొప్ప వారని, తొలి, మలి ఉద్యమాల్లో రాష్ట్రం ఏర్పడాలని ఒక బలమైన ఆకాంక్షను వెలిబుచ్చి ఆశీర్వదించిన గడ్డ సిద్దిపేట అని అన్నారు. అప్పట్లో ఢిల్లీ నుంచి పిలుపు వచ్చినా పదవులు కాదు, తెలంగాణ రాష్ట్రం కావాలని నిక్కచ్చిగా చెప్పిన నేత మదన్ మోహన్ అని తెలిపారు. మదన్ మోహన్ ప్రస్తుతం మన మధ్య లేకున్నా ఆయన చేసిన సేవలు సజీవమని కొనియాడారు. అప్పట్లోనే సిద్దిపేట ప్రాంతంలో వంద పడకల ఆస్పత్రి ఏర్పాటు చేసి ప్రజలకు వైద్యం ముంగిట్లోకి తెచ్చారని గుర్తు చేశారు. ప్రస్తుతం ఉన్న మెడికల్ కళాశాలకు మదన్ మోహన్ పేరు పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసి, ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తానన్నారు. సిద్దిపేట ప్రజల కోసం పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా పనిచేద్దామని పిలుపునిచ్చారు. అంతకుముందు మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్, మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్‌లు మాట్లాడుతూ మదన్ మోహన్‌తో తమ కు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేశారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో మదన్ మోహన్ బంధువులు సాధన, రవీంద్రనాథ్, అనుపమ, హరిందర్, ప్రశాంత్, మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్స్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి, నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.


