రయ్‌రయ్
ప్రయాణం ఇక సులభతరం
నలు దిక్కులా
హుస్నాబాద్‌కు నలు దిక్కులా నాలుగు లేన్ల రోడ్లతో ప్రయాణం ఇక సులభతరం కానుంది. కరీంనగర్, హనుమకొండ,సిద్దిపేట, జనగామ జిల్లాలు హుస్నాబాద్ నుంచి 40 నుంచి 45 కి.మీ. దూరంలో ఉంటాయి. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి నుంచి హుస్నాబాద్ మీదుగా సిద్దిపేట వరకు జాతీయ రహదారి పనులు తుది దశకు చేరుకున్నాయి. అలాగే కరీంనగర్ రాజీవ్ రహదారి కొత్తపల్లి నుంచి హుస్నాబాద్‌కు రూ.88 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న నాలుగు లేన్ల రహదారి పనులు ప్రారంభమయ్యాయి. కొత్తగా మొదటి ఫేజ్‌లో హుస్నాబాద్ నుంచి అక్కన్నపేట వరకు ఫోర్ లేన్ల నిర్మాణం కోసం రూ.58 కోట్లు మంజూరయ్యాయి.
హుస్నాబాద్: ఏదైనా ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే రవాణా సౌకర్యం ముఖ్యం. పారిశ్రామికంగా, వ్యవసాయ పరంగా అభివృద్ధి పరుగులు పెడుతుంది. గౌరవెల్లి ప్రాజెక్టు 95 శాతం పూర్తయింది. ఈ ప్రాజెక్టు ద్వారా భూగర్భజలాలు పెరిగి, చెరువుల నిండి వ్యవసాయ రంగం ఎంతో అభివృద్ధి చెందనుంది. అక్కన్నపేట మండలం చౌటపల్లిలో పారిశ్రామిక కారిడార్‌ను నిర్మించేందుకు అధికారులు భూ సర్వే కూడా పూర్తి చేశారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా వందలాది మందికి ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయి. హుస్నాబాద్‌లో ఏర్పాటు చేసిన ఇంజనీరింగ్ కళాశాలకు వివిధ జిల్లాల నుంచి వచ్చే విద్యార్థులకు నాలుగు వరుసల రహదారితో రవాణా సౌకర్యం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
భూముల ధరలకు రెక్కలు..
వాణిజ్య, వ్యాపారులకు సరుకుల రవాణా అనువుగా ఉంటుంది. భూముల ధరలకు రెక్కలు రానున్నాయి. జనగామ వరకు రహదారి పూర్తయితే యాదాద్రి పుణ్యక్షేత్రానికి వెళ్లేందుకు దూర భారం తగ్గుతుంది. అలాగే హుస్నాబాద్ ప్రాంతానికి గుండెకాయ లాంటి మహా సముద్రం గండి పర్యాటక కేంద్రంగా మారబోతుంది. మహా సముద్రం గండిని రూ.10 కోట్ల అంచనా వ్యయంతో టూరిజం స్పాట్‌గా తీర్చిదిద్దేందుకు అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. నాలుగు వరుసల రోడ్లతో వాహనాల రాకపోకలతో హుస్నాబాద్‌లో వ్యాపారం జోరుగా సాగనుంది. పారిశ్రామికంగా, వ్యవసాయ పరంగా, టూరిజం పరంగా ప్రగతి పథంలో హుస్నాబాద్ నిలువనుంది.
వేగంగా ఫోర్ లేన్ల రహదారుల నిర్మాణం
నాలుగు జిల్లాలకు సరిహద్దు కేంద్రంగా హుస్నాబాద్
కొత్తగా హుస్నాబాద్– అక్కన్నపేట కోసం రూ.58 కోట్లు మంజూరు


