కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటం
● లేబర్ కోడ్‌లను రద్దు చేయాల్సిందే
● సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు
సిద్దిపేటఅర్బన్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వర్గ వ్యతిరేక విధానాలపై సీఐటీయూ ఆధ్వర్యంలో అలుపెరుగని పోరాటాలు నిర్వహిస్తామని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు తెలిపారు. ఆదివారం సిద్దిపేటలోని ఓ గార్డెన్‌లో సీఐటీయూ జిల్లా నాల్గవ మహాసభ జరిగింది. జిల్లా అధ్యక్షుడు ఎల్లయ్య అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన చుక్క రాములు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాల వల్ల కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కార్మిక చట్టాలను లేబర్ కోడ్‌లుగా తీసుకురావడంతో కార్మికుల్ని కట్టు బానిసలుగా మార్చే ప్రయత్నం చేసిందని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలన్ని కారు చౌకగా ప్రైవేటుకు అప్పగించడం వల్ల పెట్టుబడిదారి చేతుల్లో కార్మికులు బానిసలుగా మారేలా కేంద్ర ప్రభుత్వం చేస్తోందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్కీం వర్కర్లకు ఇచ్చిన హామీ మేరకు వేతనాలు పెంచకుండా ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు. మధ్యాహ్న భోజన కార్మికులకు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, ఆశ, అంగన్‌వాడీ కార్మికులకు వేతనాలు పెంచడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. షెడ్యూల్ పరిశ్రమలలో పనిచేస్తున్న కార్మికులకు వేతన ఒప్పందాలు చేసి వేతనాలు పెంచాల్సి ఉండగా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. అంతకుముందు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో మహాసభ ఆహ్వాన సంఘం చైర్మన్ చంద్రారెడ్డి, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పద్మశ్రీ, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు మల్లారెడ్డి, సీఐటీయూ జిల్లా కార్యదర్శి గోపాలస్వామి, భాస్కర్, సత్తిరెడ్డి, పద్మ, స్వామి, మదు, రవికుమార్, మహేష్, శోభ, కనకయ్య, బాలనర్సయ్య, తదితరులు పాల్గొన్నారు.


