చెత్త ఆదాయంపై చిత్తశుద్ధి ఏదీ? | - | Sakshi
Sakshi News home page

చెత్త ఆదాయంపై చిత్తశుద్ధి ఏదీ?

Nov 17 2025 10:01 AM | Updated on Nov 17 2025 10:01 AM

చెత్త ఆదాయంపై చిత్తశుద్ధి ఏదీ?

చెత్త ఆదాయంపై చిత్తశుద్ధి ఏదీ?

మున్సిపాలిటీల్లో సాగని వర్మీకంపోస్ట్‌ తయారీ

అరకొర సిబ్బంది, సౌకర్యాల లేమి..

జిల్లాలోని మున్సిపాలిటీల్లో తడి చెత్త ద్వారా కంపోస్ట్‌ తయారీ ప్రక్రియ నామమాత్రంగా సాగుతోంది. దీని ద్వారా మున్సిపాలిటీలకు ఆదాయం వచ్చే అవకాశమున్నా.. ఆ దిశగా చర్యలు చేపట్టడంలేదు. సిద్దిపేట మినహా మిగిలిన నాలుగు మున్సిపాలిటీల్లోనూ ఇదే దుస్థితి నెలకొంది.

గజ్వేల్‌: జిల్లాలోని మున్సిపాలిటీల్లో ‘చెత్త’తో ఆదాయం వచ్చే మార్గాలపై చిత్తశుద్ధి కరువైంది. సిద్దిపేటలో ఈ ప్రక్రియ కొంతవరకు సాగుతుండగా, మిగతా మున్సిపాలిటీల్లో నామమాత్రంగానే మారింది. గజ్వేల్‌– ప్రజ్ఞాపూర్‌ మున్సిపాలిటీ పరిధిలో ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీలతో కలుపుకొని 15వేలకుపైగా ఇళ్లు ఉన్నాయి. జనాభా 80వేల పైచిలుకు చేరుకున్నది. ఈ నేపథ్యంలో ఇక్కడ నిత్యం ఉత్పత్తి అవుతున్న చెత్త 18 మెట్రిక్‌ టన్నుల పైనే. ఈ చెత్తను నల్లవాగు గడ్డ వద్ద నిర్మించిన డంపింగ్‌ యార్డుకు తరలిస్తారు. ఇక్కడ తడి, పొడి, హానికర చెత్తను వేరు చేసే ప్రక్రియ కూడా అంతంత మాత్రంగానే సాగుతోంది.

నామమాత్రంగానే..

డంపింగ్‌ యార్డులో తడి చెత్తను కంపోస్ట్‌గా మార్చడానికి 12 బెడ్లను నిర్మించారు. వీటిల్లో శాసీ్త్రయంగా కంపోస్ట్‌ ప్రక్రియను చేపట్టాల్సి ఉన్నా జరగడం లేదు. నామమాత్రంగా నెలకు కొంత కంపోస్ట్‌ను తయారీ చేసి చేతులు దులుపుకుంటున్నారు. నిజానికి కంపోస్ట్‌ ద్వారా ఏటా మున్సిపాలిటీకి రూ.లక్షల్లో ఆదాయం వచ్చే అవకాశమున్నా... ఈ అంశంపై నిర్లక్ష్యం కొనసాగుతోంది.

సిబ్బంది కొరతే కారణం..

గజ్వేల్‌– ప్రజ్ఞాపూర్‌ మున్సిపాలిటీలో ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీతో కలుపుకొని ప్రస్తుతం 162మంది పారిశుద్ధ్యి సిబ్బంది ఉన్నారు. మరో 50మందికిపైగా సిబ్బంది అవసరం. ఇక్కడ 30 వరకు చెత్త సేకరణ వాహనాలు ఉండగా, మరో అయిదు వాహనాలు అవసరమున్నాయి. మరో ముఖ్యమైన అంశమేమీటంటే పారిశద్ధ్య సమస్యను పర్యవేక్షించాల్సిన శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ పోస్టు ఖాళీగా ఉండటం వల్ల ..ఇన్‌ఛార్జితో నెట్టుకొస్తున్నారు. ఫలితంగా తడి చెత్తతో కంపోస్ట్‌ తయారీ ప్రక్రియ సక్రమంగా సాగటం లేదని తెలుస్తోంది.

మిగతా మూడు మున్సిపాలిటీల్లోనూ..

మిగిలిన మూడు మున్సిపాలిటీల్లో పరిస్థితిని పరిశీలిస్తే.. తడిచెత్తతో కంపోస్ట్‌ తయారీ దేవుడెరుగు.. కనీసం చెత్త సేకరణ శాసీ్త్రయంగా సాగడం లేదు. హుస్నాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలో దాదాపు 36వేల జనాభా, 6800 ఇళ్లు ఉన్నాయి. రోజు దాదాపు 11మెట్రిక్‌ టన్నుల చెత్తను సేకరిస్తున్నారు. దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలో చెత్త తరలింపు సమస్యగానే పరిణమించింది. దుబ్బాకలో 30వేలజనాభా ఉండగా.. 7400 వేల ఇళ్లు ఉన్నాయి. ఇక్కడ నిత్యం 4.5మెట్రిక్‌ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతోంది. చేర్యాల మున్సిపాలిటీలో చెత్త సేకరణ సక్రమంగా సాగక నివాస ప్రాంతాల పక్కను చెత్తను తగులబెట్టడం ఇబ్బందికరంగా మారుతోంది.

మరింత సిబ్బంది కావాలి

ప్రస్తుతం తడి చెత్తతో వర్మీ కంపోస్ట్‌ తయారీ అనుకున్న స్థాయిలో సాగడం లేదు. దీనిని పెంచాలంటే మరింత సిబ్బంది కావాలి. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. – బాలకృష్ణ,

గజ్వేల్‌–ప్రజ్ఞాపూర్‌ మున్సిపల్‌ కమిషనర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement