
మక్కకు దిక్కేది?
పది రోజులుగా యార్డులో రైతులు పడిగాపులు అందినకాడికి దండుకుంటున్న ప్రైవేటు వ్యాపారులు
జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డులో ప్రభుత్వ మద్దతు ధర పొందడానికి మక్క రైతులు పడిగాపులు కాస్తున్నారు. పది రోజులుగా మక్కతో ఎదురుచూస్తున్నారు. కొనుగోళ్ల కేంద్రాలు ఏర్పాటు చేసి కొనుగోలు చేయాల్సిన ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్రాల ఏర్పాటుకు మార్కెటింగ్ శాఖ అధికారులు లేఖ రాసి నెల రోజులు కావొస్తున్నా చడీచప్పుడు కానరావడంలేదు. సిద్దిపేట యార్డులో కొనుగోలు కేంద్రం జాడ లేకపోవడంతో ప్రయివేటు వ్యాపారులు తక్కువ ధరతో నిలువుదోపిడీకి పాల్పడుతున్నారు.
సిద్దిపేటజోన్: బతుకమ్మ, దసరా పండుగల ఖర్చుల నుంచి బయటపడేందుకు అన్నదాతలు ముందస్తుగా యార్డుకు పెద్ద ఎత్తున మక్కలు తరలించారు. జిల్లాలో ఈసారి పెద్ద ఎత్తున పంట సాగు అయింది. వ్యవసాయ శాఖ అధికారుల అంచనా ప్రకారం 29 వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగు అయినట్లు సమాచారం. ఈ లెక్కన 6 లక్షల క్వింటాళ్లకుపైగా దిగుబడి వస్తుందని అంచనా. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మొక్కజొన్న క్వింటాలుకు రూ.2,400 మద్దతు ధర ప్రకటించింది.
రూ.300 తక్కువకు..
సిద్దిపేట మార్కెట్ యార్డులో విక్రయానికి మక్కలు పెద్ద ఎత్తున వస్తున్నాయని, కొనుగోలు కేంద్ర ఏర్పాటు ఆవశ్యకత వివరిస్తూ జిల్లా అధికారులు ప్రభుత్వానికి లేఖ రాశారు. గత నెల 16న రాసినా ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం లేదు. మరోవైపు సిద్దిపేట యార్డులో ప్రయివేటు వ్యాపారులు నెల రోజులుగా మక్కలను కొనుగోలు చేస్తున్నారు. తేమ, పొల్లు, గింజ నాణ్యత తదితర కారణాలను సాకుగా చూపి తక్కువ ధర నిర్ణయిస్తున్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో చేసేదిలేక కొందరు రైతులు ఉత్పత్తులను ప్రైవేటుకు విక్రయిస్తున్నారు. దీంతో రైతు ప్రతి క్వింటాల్‌కు రూ.350 నుంచి రూ 500 వరకు నష్టపోతున్నారు. గడిచిన నెల రోజుల్లో ప్రయివేటు వ్యాపారులు 190మంది నుంచి సుమారు 4 వేల క్వింటాళ్ల మక్కలను కొనుగోలు చేసినట్లు సమాచారం.
తడిసిన మక్కలు
సిద్దిపేట మార్కెట్ యార్డులో రోజులతరబడి ఎదురుచూస్తున్న రైతన్నను వరుణుడు కూడా కరుణించడంలేదు. ములిగే నక్కపై తాటి పండు పడ్డ చందంగా గురువారం తెల్లవారుజామున కురిసిన వర్షానికి ఆరబోసిన మక్కలు తడిసిముద్దయ్యాయి. దీంతో రైతు లబోదిబోమంటూ మళ్లీ ఆరబోసే ప్రయత్నాలు చేశారు.
– సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, సిద్దిపేట
ఎప్పుడు ప్రారంభిస్తారో..
ఈసారి ఐదు ఎకరాల్లో మక్క వేశాను. రెండు ట్రాక్టర్ల నిండా యార్డుకు తెచ్చాను. ఐదు రోజులుగా ఇక్కడే ఉన్నాం. సర్కారు కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయలేదు. ప్రయివేటు వాళ్లు వచ్చి తక్కువకు అడుగుతున్నారు. ప్రభుత్వం తక్షణం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి.
–మమత, ఎల్లారెడ్డిపేట)
పది రోజులుగా పడిగాపులు
పదహారు ఎకరాల్లో మక్క పంట వేశా. 12 ట్రాక్టర్లలో యార్డుకు పంట తెచ్చా. ప్రభుత్వ మద్దతు ధర క్వింటాలుకు రూ.2,400 వస్తుందని ఇక్కడకు వస్తే ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయలేదు. ప్రయివేటు వ్యాపారులు రూ.2 వేలకే అడుగుతున్నారు. పది రోజులుగా ఇక్కడే ఉంటున్నాం. ప్రభుత్వం న్యాయం చేయాలి.
–రెడ్డి ఎల్లవ్వ, పెద్దకోడూర్
వర్షానికి తడిసిన మక్కలను ఆరబోస్తున్న రైతు
జాడలేని కొనుగోలు కేంద్రాలు