
వార్డుల పెంపునకు ప్రతిపాదనలు
● కలెక్టర్ ద్వారా సీడీఎంఏకు పంపిన మున్సిపల్ అధికారులు ● త్వరలోనే కసరత్తు ప్రారంభమయ్యే అవకాశం
గజ్వేల్: మున్సిపాలిటీలో వార్డుల పెంపునకు రంగం సిద్ధమైంది. కొద్ది నెలల్లోనే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించే అవకాశమున్నందువల్ల కొత్తగా గ్రామాలు విలీనమైన మున్సిపాలిటీల్లో ఈ ప్రక్రియ అనివార్యమవుతోంది. ఇందులో భాగంగా గజ్వేల్–ప్రజ్ఞాపూర్‌తోపాటు రాష్ట్రంలోని ఇంద్రేశం, జిన్నారం మున్సిపాలిటీల్లో వార్డుల డీలిమిటేషన్ జరుగనుంది. ఇందుకు సంబంధించి గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కమిషనర్ కొన్ని రోజుల క్రితం కలెక్టర్ ద్వారా సీడీఎంఏ(కమిషనర్ అండ్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్)కు ప్రతిపాదనలు పంపారు. ఈ మున్సిపాలిటీలో ముట్రాజ్‌పల్లి, సంగాపూర్‌ల పరిధిలోని మల్లన్నసాగర్ నిర్వాసిత కాలనీ(ఆర్‌అండ్‌ఆర్ కాలనీ) విలీనమైన సంగతి తెల్సిందే. ఈ కాలనీ పరిధిలో ప్రస్తుతం 11,601 మంది ఓటర్లు ఉన్నారు. ఇప్పటికే మున్సిపాలిటీ పరిధిలో 34,365మంది ఓటర్లు ఉండగా.. మొత్తం ఓటర్ల సంఖ్య 45,966కు చేరింది. జనాభా 75వేల పైచిలుకు చేరుకున్నది. మున్సిపాలిటీలో ప్రస్తుతం 20వార్డులు ఉండగా, డీలిమిటేషన్‌లో భాగంగా 1500మంది ఓటర్లకు ఒక వార్డు లెక్కేసినా.. వార్డుల సంఖ్య 30కి చేరుకోనుంది. ఓటర్ల సంఖ్య, జనాభా, వైశాల్యం, ఆదాయపరంగా చూస్తే మున్సిపాలిటీ గ్రేడ్ వన్‌గా మారే అవకాశాలు ఉన్నాయి. ఈ అంశంపై స్థానిక మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ మాట్లాడుతూ వార్డుల పెంపునకు సంబంధించి ప్రతిపాదనలు పంపిన మాట వాస్తవమేనని తెలిపారు. సీడీఎంఏ నుంచి ఆదేశాలు రాగానే ప్రక్రియ పూర్తి చేస్తామని వెల్లడించారు.