
ఏటీసీతో ఆర్థికంగా రాణించాలి
● కలెక్టర్ హైమావతి ● ఇర్కోడ్‌లో శిక్షణ సంస్థ సందర్శన
సిద్దిపేటరూరల్: జీవితంలో ఆర్థికంగా రాణించేందుకు నూతనంగా ప్రవేశపెట్టిన ఏటీసీ (అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్) చక్కని వేదిక అని కలెక్టర్ హైమావతి అన్నారు. గురువారం రూరల్ మండల పరిధిలోని ఇర్కోడ్ శివారులో గల ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థను కలెక్టర్ సందర్శించి విద్యార్థులకు అందించే శిక్షణ తరగతులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ముందుగా ప్రిన్సిపాల్ రామానుజ, ట్రైనింగ్ టీచర్స్‌తో సమావేశం నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ యువతకు ఉపాధి అందించేందుకు అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లను ప్రారంభించి కొత్త కోర్సులను తీసుకువచ్చినట్లు తెలిపారు. అన్ని కోర్సుల శిక్షణ సరైన పద్ధతిలో ఇవ్వాలని, ప్రతి ఒక్క విద్యార్థికి ఉపాధి అందేలా చూడాలన్నారు. ఉదయం నేర్చుకున్నది సాయంత్రం మూల్యాంకనం చేయించాలన్నారు. ఏటీసీకి కావలసిన మౌలిక వసతులు, స్టాఫ్ గురించి అన్ని వివరాలను తనకు నివేదిక రూపంలో అందించాలని ప్రిన్సిపాల్‌కు సూచించారు. ట్రైనింగ్ క్లాస్‌లో విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు.