
ఏమాయె.. గిట్లాయె!
ఇలా నామినేషన్లు.. అలా నిలిపివేత
మళ్లీ మొదటికొచ్చిన ఎన్నికల ప్రక్రియ
అంతర్మథనంలో ఆశావహులు
రిజర్వేషన్లు అనుకూలించని వారిలో ఆశలు
స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు బ్రేక్
స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ మళ్లీ మొదటికొచ్చింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ సహా ఎన్నికల కమిషన్ జారీ చేసిన షెడ్యూల్, నోటిఫికేషన్లపై హైకోర్టు స్టే విధించింది. ఇప్పటికే సహచర నాయకులను ఒప్పించి ఎంపీటీసీ, జెడ్పీటీసీ టికెట్లను ఖరారు చేసుకున్న అధికార, ప్రతిపక్ష పార్టీల ఆశావహులు కోర్టు తీర్పుతో అంతర్మథనంలో పడ్డారు. మరోవైపు ఆయా స్థానాలకు రిజర్వేషన్ల ప్రాతిపదికన అభ్యర్థుల పేర్లను ఖరారు చేసిన రాజకీయ పార్టీలకు చుక్కెదురైంది. ఇదిలా ఉంటే జిల్లాలో తొలి విడతలో 15 జెడ్పీటీసీ స్థానాలు, 125 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చారు. వెంటనే నామినేషన్లు స్వీకరణ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. అయితే తొలిరోజు ఎంపీటీసీకి మూడు, జెడ్పీటీసీకి ఏడు నామినేషన్లు దాఖలయ్యాయి. – సాక్షి, సిద్దిపేట
స్థానిక సంస్థల ఎన్నికలకు తాత్కాలికంగా బ్రేకులు పడ్డాయి. తొలి విడతలో 15 జెడ్పీటీసీ, 125 ఎంపీటీసీ స్థానాలకు గురువారం ఉదయం 10.30 గంటలకు ఆయా మండల పరిషత్తు కార్యాలయాల్లో నోటిఫికేషన్‌లను జారీ చేశారు. ఆ వెంటనే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు రిటర్నింగ్ అధికారులు ప్రకటించారు. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో మధ్యాహ్నం 2 గంటలకు వాదనలు ప్రారంభమై సాయంత్రం 4గంటల వరకు సాగింది. తీరా సాయంత్రం ఈ స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్లకు సంబంధించిన జీఓ నెం.9 పై రాష్ట్ర హైకోర్టు స్టే విధించింది. దీంతో ఎన్నికల నిర్వహణ ప్రక్రియ వాయిదా పడింది. ఎన్నికల్లో పోటీకి సిద్ధమైన అభ్యర్థులు నిరాశకు గురయ్యారు.
ఉదయం నుంచి ఉత్కంఠ
స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందోనని అందరూ టీవీలకు అతుక్కుపోయారు. ఉదయం నుంచి ఉత్కంఠగా ఎదురు చూశారు. రిజర్వేషన్లు అనుకూలించిన వారు పోటీకి సిద్ధమయ్యారు. నామినేషన్ వేసేందుకు అవసరమైన పత్రాలను, ప్రతిపాదించే వారిని సిద్ధం చేసుకున్నారు. మరోవైపు ప్రధాన రాజకీయ పార్టీలు కూడా అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేశాయి. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ నియోజకవర్గాల ఇన్‌చార్జిలు, నాయకులు పార్టీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేశాయి. టిక్కెట్ల రేసులో ఇద్దరు, ముగ్గురు ఉన్న చోట్ల ఏకాభిప్రాయానికి ప్రయత్నించారు. బరిలో నిలిచే అభ్యర్థులు డబ్బులు సైతం సిద్ధం చేసుకున్నారు. అలాగే ఇతర ప్రాంతాల్లో ఉండే బంధువులను సైతం పిలిపించుకున్నారు. ఎన్నికల ప్రచారానికి ప్రణాళికలను రూపొందించుకున్నారు. తీరా కోర్టు స్టే ఇవ్వడంతో అయోమయానికి లోనయ్యారు. కోర్టులో రిజర్వేషన్ల కేసు విచారణ కొనసాగుతుండటంతో నామినేషన్లు వేసేందుకు ఆసక్తి చూపకపోవడం గమనార్హం.
పలువురిలో చిగురిస్తున్న ఆశలు
స్థానిక సంస్థల ఎన్నికలు తాత్కాలికంగా నిలిచిపోవడంతో కొత్త రిజర్వేషన్లు.. లేక పాత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలు జరుగుతాయా..? అన్న చర్చ జిల్లా వ్యాప్తంగా జోరుగా సాగుతోంది. రిజర్వేషన్లు అనుకూలించక పలువురు నిరాశ చెందారు. కోర్టు రిజర్వేషన్ల పై స్టే ఇవ్వడంతో జనరల్ అభ్యర్థుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. త్వరలో కోర్టు ఆదేశాలతో రిజర్వేషన్లు మారవచ్చని పలువురు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.