
ప్రజారోగ్యంపై పట్టింపేది?
తూతూ మంత్రంగా తనిఖీలు
దుబ్బాకటౌన్: ప్రజలు తినే ఆహార పదార్థాల నాణ్యత ప్రశ్నార్థకంగా మారింది. జిల్లాలో పర్యవేక్షణ లేక హోటళ్లు, రెస్టారెంట్‌లు, బేకరీల నిర్వహణ ఇష్టారాజ్యంగా మారింది. అసలు పర్యావేక్షణాధికారులు ఉన్నారా? లేరా? అనే సందేహం వ్యక్తమవుతోంది.
ఫలితం బయట పెట్టని అధికారులు
ఇటీవల దుబ్బాకలోని ఉడిపీ హోటల్లో సాంబా రులో పురుగు వచ్చి కలకలం సృష్టించిన ఘటన తెలిసిందే. జిల్లా ఆహార తనిఖీ అధికారి వచ్చి సాంపిల్ తీసుకువెళ్లి నెలలు గడుస్తున్నా దాని ఫలితం బయట పెట్టక పోవడంతో ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
బేకరీల్లో కాలం చెల్లిన కేక్‌లు
పట్టణంలోని కొన్ని బేకరీలలో మున్సిపల్ అధికారుల చేపట్టిన తనిఖీలలో కాలం చెల్లిన కేక్‌లు బయటపడ్డాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు ఎప్పడికప్పుడు సక్రమంగా తనిఖీలు చేపట్టకపోవడంతో బేకరీలు, హోటళ్ల యజమానులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాణ్యతలేని, కాలం చెల్లిన తినుబండారాలను అమ్మతున్నారని వాపోతున్నారు. అదే విధంగా బేకరీలో ఆహార పదార్థాలు తయారు చేసే ప్రదేశం అపరిశుభ్రంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అలాగే ఒక బేకరిలో కుళ్లిన కేక్ విక్రయించగా తిన్న పిల్లలు అనార్యోగం బారినపడ్డారు. అయినప్పటికీ ఆహార తనిఖీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని ప్రజలు వాపోతున్నారు.
ఫిర్యాదు చేస్తేనే తనిఖీలు
ఆహార పదార్థాల్లో ఏ పురుగో, కీటకాలనో గుర్తించినప్పుడు ఎవరైనా ఫిర్యాదు చేస్తేనే వచ్చి శాంపిల్ సేకరించి ఫలితం బయట పెట్టకుండా చేతులు దులుపుకుంటున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారో తెలియడం లేదని వాపోతున్నారు.
కాలం చెల్లిన పదార్థాల విక్రయం
తయారీలో నాణ్యత కరువు
కానరాని పర్యవేక్షణ
అధికారులు తీరు మార్చకోవాలి
జిల్లాలో కొంత మంది హోటల్, బేకరీ, ఇతర ఆహార విక్రయదారులు ప్రజల ఆరోగ్యంతో వ్యాపారం చేస్తున్నారు. నాణ్యత లేని, కాలం చెల్లిన పదార్థాలను విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. దుబ్బాకలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎందు కు తనిఖీలు నిర్వహించడం లేదో అర్థం కావడం లేదు. ఇకనైనా అధికారులు తీరు మార్చుకోవాలి.
– మాడబోయిన శ్రీకాంత్, దుబ్బాక
సహించేదే లేదు..
దుబ్బాకలో బేకరీలు, హోటళ్లు, రెస్టారెంట్లలో అపరిశుభ్ర వాతావరణంలో ఆహారపదార్థాల తయారు చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. పరిశుభ్రత పాటించకుంటే జరిమానాలు తప్పవు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే సహించేది లేదు.
– రమేశ్ కుమార్, మున్సిపల్ కమిషనర్, దుబ్బాక

ప్రజారోగ్యంపై పట్టింపేది?

ప్రజారోగ్యంపై పట్టింపేది?

ప్రజారోగ్యంపై పట్టింపేది?