
‘గౌరవెల్లి’ని పూర్తి చేసి తీరుతాం
రైతుల చిరకాల కోరిక తీరుస్తాం
మంత్రి పొన్నం ప్రభాకర్
ఎంపీడీఓ కార్యాలయ
భవన నిర్మాణానికి శంకుస్థాపన
అక్కన్నపేట(హుస్నాబాద్): మొట్టప్రాంత రైతుల చిరకాల కోరికైన గౌరవెల్లి ప్రాజెక్టును త్వరలోనే పూర్తి చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మండల కేంద్రంలో ఎంపీడీఓ కార్యాలయ భవన నిర్మాణానికి రూ.1.50 కోట్ల నిధుల వ్యయంతో నిర్మించనున్న భవన నిర్మాణానికి గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొలాలన్నింటికీ సాగునీరందించి సస్యశ్యామలం చేస్తామన్నారు. 2016లో అక్కన్నపేట మండలం ఏర్పాటు కాగా అప్పటి నుంచి ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు లేవన్నారు. గత ప్రభుత్వం పట్టించుకున్న పాపానపోలేదన్నారు. ఎంపీడీఓ కార్యాలయ భవన నిర్మాణ పనులు శరవేగంగా పూర్తిచేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. త్వరలోనే తహసీల్దార్ భవన నిర్మాణానికి కూడా నిధులు మంజూరు అయ్యేలా కృషి చేస్తానన్నారు. గ్రామాల్లో ఏ సమస్య ఉన్నా పరిష్కారం చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ హైమావతి, అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, హుస్నాబాద్ సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, పార్టీ మండలాధ్యక్షుడు ఐలయ్య, నాయకులు పాల్గొన్నారు.
ఇంజనీరింగ్ కళాశాలలో వసతులు కల్పించాం
హుస్నాబాద్: కొత్తగా ఏర్పాటు చేసిన హుస్నాబాద్ శాతవాహన యూనివర్సిటి ఇంజనీరింగ్ కళాశాలలో అన్ని రకాల మౌలిక సదుపాయా లు కల్పించామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గురువారం రవాణా శాఖ టెక్నికల్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విద్యార్ధు లకు పుస్తకాలు, క్యాలిక్యులేటర్స్, ఇతర కిట్స్ పంపిణీ చేశారు. మంత్రి మాట్లాడుతూ విద్యార్థులకు ఇబ్బంది లేకుండా ఉండటానికి హాస్టల్ వసతి ఏర్పాటు చేశా మన్నారు. కళాశాలలో విద్యార్థుల సంఖ్య పెంచడానికి ప్రత్యేకంగా స్పాట్ అడ్మిషన్లకు అవకాశం కల్పించామన్నారు. కార్యక్రమంలో యూనివర్సిటీ వీసీ ఉమేష్ కుమార్, ఆర్డీఓ రామ్మూర్తి, ప్రిన్సిపాల్ తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.