
‘మత్తు’ వదిలించేందుకే బైక్ యాత్ర
● ప్రభుత్వ ఉపాధ్యాయుడి సాహసయాత్ర ● జిల్లాలో విస్తృతంగా అవగాహన
సాక్షి, సిద్దిపేట: పండుగ సెలవులు వస్తే చాలా మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు తమ ఫ్యామిలీతో, లేదా ఫ్రెండ్స్‌తో విహార యాత్రలు చేస్తుంటారు. కానీ సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం గోరంట్ల జెడ్పీహెచ్ ఉపాధ్యాయుడు ప్రభాకర్ మాత్రం డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా నడుంబిగించారు. ఇందుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు బైక్ యాత్ర చేపడుతున్నారు. ఈ నెల 21న సూర్యాపేటలో ప్రారంభమైన యాత్ర 900 కిలో మీటర్ల మేర సాగింది. యాత్ర ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, కరీంనగర్, సిరిసిల్ల జిల్లాలో కొనసాగి.. సిద్దిపేట మీదుగా జనగాం వరకు గురువారం చేరుకుంది.
తన బాల్య మిత్రుడి వలే..
బాల్య మిత్రుడు ధూమపానానికి బానిసై క్యాన్సర్ బారినపడి మృతి చెందాడు. మత్తు పదార్థాలతో నిత్యం ఏదో ఒకచోట ప్రమాదాలు, అఘాయిత్యాలు జరుగుతున్నాయి. తన బాల్యమిత్రుడి వలె ఎవరూ బలికావద్దని, మత్తుపదార్థాల నిర్మూలనకు జనచైతన్యమే మార్గమని భావించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
జిల్లాలో పర్యటన
జిల్లాలో జనం రద్దీ ఉండే ప్రాంతాలు, బస్టాండ్, టీ స్టాల్, కూలీల అడ్డాల దగ్గర ఆగి.. యువత, ప్రజలు మాదకద్రవ్యాలకు, ధూమపానానికి బానిసై భవిష్యత్తును అంధకారం చేసుకోవద్దంటూ ప్రచారం చేశారు. సిద్దిపేటకు వచ్చిన సందర్భంగా ప్రభాకర్‌ను కుమ్మరి సంఘం రాష్ట్ర నాయకుడు రామచంద్రం, మోటివేషనల్ స్పీకర్ నాగరాజు, సోషల్ స్టడీస్ ఫోరమ్ అధ్యక్షుడు పూర్ణచందర్ రావులు సన్మానించారు.
ప్రజల్లో చైతన్యం కల్పించేందుకే..
మత్తు పదార్థాల బారినపడి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దన్న ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా బైక్ యాత్రను చేపట్టాను. నా బాల్యమిత్రుడు సిగరేట్ తాగి క్యాన్సర్‌తో మృతిచెందారు. నన్ను కొందరు హేళన చేస్తున్నా.. నా ఆశయం నెరవేరేందుకు ఇబ్బందులు ఎదురైనా లెక్కచేయకుండా చైతన్యం కల్పిస్తున్నాను.
–రాచకొండ ప్రభాకర్, ప్రభుత్వ ఉపాధ్యాయుడు