
2.24 లక్షల మెట్రిక్ టన్నులబియ్యం ఎగుమతి
గతేడాది జూలై నుంచి ఇప్పటివరకు..
● గజ్వేల్ రేక్ పాయింట్ రికార్డు ● ఒక్కో రేక్ సామర్థ్యం 2,800 టన్నులపైనే.. ● దేశంలోని వివిధ రాష్ట్రాలకు తరలింపు
గజ్వేల్: సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో మూడేళ్ల క్రితం ఏర్పాటైన రేక్ పాయింట్ ద్వారా ఎఫ్‌సీఐ (భారత ఆహార సంస్థ)కు చెందిన బియ్యం ఎగుమతులు రికార్డు స్థాయిలో సాగుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పదికిపైగా ముఖ్యమైన రేక్ పాయింట్లు ఉండగా, వాటికి దీటుగా ఇక్కడ లావాదేవీలు నడుస్తున్నాయి. గతేడాది జూలై నుంచి ఇప్పటివరకు 80కిపైగా రేక్‌ల ద్వారా 2.24లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఎగుమతి అయ్యాయి. అలాగే.. రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాలకు రసాయనిక ఎరువుల సరఫరా కేంద్రంగా, వ్యవసాయోత్పత్తుల ఎగుమతికి నిలయంగా మారింది. భవిష్యత్‌లో ఈ రేక్ పాయింట్ మరింత కీలకంగా మారనున్నది. గజ్వేల్‌లో 2022 జూన్ 27న రేక్ పాయింట్‌ను ప్రారంభించారు. ఇప్పటికే రాష్ట్రంలో సనత్‌నగర్, వరంగల్, నిజామాబాద్, కామారెడ్డి, తిమ్మాపూర్, జమ్మికుంట, మహబూబ్‌నగర్, జమ్మికుంట, మహబూబాబాద్ తదితర రేక్ పాయింట్లు ఉండగా, గజ్వేల్‌లో కొత్తగా ఏర్పాటైంది. మెదక్ జిల్లా మనోహరాబాద్ నుంచి కొత్తపల్లి వరకు 151.36 కిలోమీటర్ల పొడవున ఈ న్యూబ్రాడ్‌గేజ్ లైనన్‌్ నిర్మాణం జరుగుతుండగా.. ఈ లైన్‌పై గజ్వేల్ రైల్వే స్టేషన్ ఉన్నది. ఈ స్టేషన్ వద్ద రేక్ పాయింట్‌ను ఏర్పాటు చేశారు.
ఎఫ్‌సీఐకి ప్రధాన వనరుగా..
గజ్వేల్ రేక్ పాయింట్ ఎస్‌సీఐకి ప్రధాన వనరుగా మారింది. ఈ ప్రాంతంలోని అక్కారం, అల్లాపూర్ గోదాముల నుంచి బాయిల్డ్ రైస్‌ను దేశంలోని కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, కర్నాటక తదితర రాష్ట్రాలకు ఇక్కడి నుంచి రైలు మార్గంలో గూడ్స్ రైళ్ల ద్వారా తరలిస్తున్నారు. గతేడాది జూలై నుంచి ఇప్పటివరకు సుమారుగా 80 రేక్‌ల ద్వారా 2.24లక్షల మెట్రిక్ టన్నుల బియ్యంను ఇక్కడి నుంచి ఎగుమతి చేశారు. ఒక్కో రేక్ సామర్థ్యం 2,800 టన్నులకుపైనే ఉంటుంది. ఇదే కాదు.. ఈ రేక్ పాయింట్‌కు తమిళనాడు రాష్ట్రలోని కరిగెకళ్, ఏపీలోని వైజాగ్, కాకినాడ పోర్టుల నుంచి రైలు మార్గం ద్వారా కాంప్లెక్స్ ఎరువులతోపాటు యూరియా నిల్వలు వస్తాయి. ఇలా వచ్చిన నిల్వలను సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, యాదాద్రితోపాటు కామారెడ్డి, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ తదితర జిల్లాలకు కేటాయింపుల వారీగా వ్యవసాయశాఖ సరఫరా చేస్తున్నది. మక్కలు ఇతర వ్యవసాయోత్పత్తులు సైతం ఇక్కడి నుంచి ఇతర రాష్ట్రాలను ఎగుమతి చేస్తున్నారు. మూడేళ్ల క్రితం ఏర్పాటైన ఈ రేక్ పాయింట్ అనతి కాలంలోనే తనకంటూ ప్రత్యేకతను చాటుకున్నది. ప్రత్యేకించి హైదరాబాద్ నగరంలోని రేక్ పాయింట్‌లకు ప్రత్యామ్నాయం కావడం వల్ల రాబోవు రోజుల్లో మరింత కీలకంగా మారబోతున్నది. ఈ పరిస్థితి గజ్వేల్ నియోజకవర్గంలోని మనోహరాబాద్ మండలం పరికిబండలో ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్న మల్టీమోడల్ లాజిస్టిక్ హబ్‌కు అనుకూలంగా మారింది.