
సంప్రదాయ పంటలకు స్వస్తి
త్వరలోనే నర్మేట ఫ్యాక్టరీ ప్రారంభం ఇక్కడే పామాయిల్ ప్యాకింగ్ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు
నంగునూరు(సిద్దిపేట): సంప్రదాయంగా సాగు చేస్తున్న వరి, పత్తి, మొక్కజొన్న పంటలకు స్వస్తి పలకాలని వ్యవసాయశాఖ, మార్కెటింగ్‌శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు అన్నారు. నర్మేటలో నిర్మించిన ఆయిల్‌పామ్ ప్యాక్టరీని శనివా రం ఆయన సందర్శించి పనులపై ఆరా తీశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గింజల నుంచి ఆయిల్ తీసే ప్రక్రియ విజయవంతంగా పూర్తయిందని, అధికారులు చెప్పడంతో సీఎం చేతుల మీదుగా ప్రారంభించేలా సిద్ధం చేయాలన్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే నర్మేటలో అత్యాధునిక టెక్నాలజీతో నిర్మిస్తున్న ఆయిల్ ఫ్యాక్టరీపైనే మొదటి సంతకం చేసినట్లు గుర్తు చేశారు. నర్మేట ప్యాక్టరీ దేశానికే దిక్సూచిగా నిలుస్తుందన్నారు. హైదరాబాద్‌కు సమీపంలో ఉన్న ఈ ప్యాక్టరీ సిద్దిపేట జిల్లాకు ఎంతో కీలకంగా మారనుందన్నారు. రాష్ట్రంలో తయారయ్యే పామాయిల్‌ను ఇతర రాష్ట్రాలకు పంపితే అక్కడే ప్యాకింగ్ చేశారని, ఇక నుంచి నర్మేటలోనే శుద్ధి చేసి ప్యాకింగ్ చేస్తారన్నారు.
నాలుగేళ్లు అంతర పంటలు
ఆయిల్‌పామ్ తోటలోనాలుగేళ్ల పాటు అంతర పంటగా కోకో, జాజి, మొకడామియా, మునగ, వక్క పంటలను సాగు చేయడంతో అధిక లాభాలు గడించవచ్చని మంత్రి అన్నారు. ఆయిల్‌పామ్ టన్నుకు రూ.20 వేలు అందించేలా కృషి చేస్తామన్నారు. కావున ఆయిల్‌పామ్ సాగు శాతం పెంచేలా అధికారులు, శాస్త్రవేత్తలు కృషి చేయాలన్నారు. ఆయన వెంట ఆయిల్‌ఫెడ్ చైర్మన్ జంగ రాఘవరెడ్డి, రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ రఘునందన్‌రావు, ఉద్యానవన శాఖ డెరెక్టర్ షేక్ యాస్మిన్‌బాషా, కలెక్టర్ హైమావతి, అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్, ఆయిల్‌ఫెడ్ ఎండీ శంకరయ్య, జిల్లా ఉద్యానవనశాఖ అధికారి సువర్ణ, ఆయిల్‌ఫెడ్, వ్యవసాయ, రెవిన్యూ శాఖ అధికారులు పాల్గొన్నారు.