
కనెక్షన్.. కలెక్షన్!
● విద్యుత్ శాఖలో పైరవీలదే రాజ్యం ● అధికారులు, కాంట్రాక్టర్ల చేతి వాటం ● ఒక్కో కనెక్షన్‌కు రూ10 వేల నుంచి 20 వేలు వసూలు
సాక్షి, సిద్దిపేట: విద్యుత్ శాఖలో పైరవీలకే పెద్దపీట వేస్తున్నారు. పైస లేనిదే పని కావడం లేదని ఆరోపణలు ఉన్నాయి. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ కోసం డీడీలు చెల్లించినా అధికారులు, కాంట్రాక్టర్లకు చేతులు తడపాల్సిందే. దరఖాస్తులు సీరియల్ నంబర్ ప్రకారం కాకుండా పైరవీ చేసిన వారికే పెద్దపీట వేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. లేకుంటే ఏదో సాకులు చెప్పి విద్యుత్ కనెక్షన్‌లు జాప్యం చేస్తున్నారు. విద్యుత్ ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడం.. కొందరు సిబ్బంది, కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా డబ్బులు వసూలు చేస్తున్నారని తెలుస్తోంది. దీంతో రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందిస్తుండటంతో సాగునీటి సౌకర్యం లేని సన్నకారు రైతులు సైతం బోరు వేసి పంటలను పండిస్తున్నారు. ఒకప్పుడు వర్షాధారం మీదనే పంటలు పండించేవారు. ప్రస్తుతం బోర్ల ద్వారా పంటలు ఎక్కువగానే సాగు చేస్తున్నారు. దీంతో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్‌లకు డిమాండ్ పెరిగింది. జిల్లా వ్యాప్తంగా 2,627 విద్యుత్ కనెక్షన్లు ఇంకా పెండింగ్ ఉన్నాయి.
కాసులిస్తేనే..
కొత్తగా విద్యుత్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారి నుంచి కొందరు విద్యుత్ అధికారులు, సిబ్బంది, కాంట్రాక్టర్లు కాసులు దండుకుంటున్నారు. సిఫార్సులు, పైరవీలతో పాటు చేతులు తడిపిన వారికే ముందస్తు కనెక్షన్లు ఇస్తున్నారు. సాధారణ రైతులకు మాత్రం నెలల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. ట్రాన్స్‌ఫార్మర్, ఇతర మెటీరియల్, కనెక్షన్ కావాలంటే రూ.10వేల నుంచి రూ.20వేల వరకు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికై నా ఉన్నతాధికారులు దృష్టి సారించి అవినీతి, అక్రమాలను అరికట్టాలని రైతులు, వినియోగదారులు కోరుతున్నారు.