
కరెంట్ తీగ కాజేస్తుండ్రు
వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లలో దగా
కరెంట్ తీగలను దోచేస్తున్నారు. విద్యుత్ అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మకై ్క రైతులకు ప్రభుత్వం సబ్సిడీ ద్వారా అందించే కరెంట్ వైరును కాజేస్తున్నారు. సాగు నీటిని అందించేందుకు తప్పని పరిస్థితుల్లో విద్యుత్ వైర్లు బయట కొనుగోలు చేసి కాంట్రాక్టర్లకు అందిస్తే బిగిస్తున్నారు. రైతుల ఆపదను ఆసరాగా చేసుకుని విద్యుత్ వైరును పలువురు కాంట్రాక్టర్లు అందించడం లేదు. విద్యుత్ అధికారుల లెక్కల ప్రకారం జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 1,79,527 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు దరఖాస్తు చేశారు. అందులో 1,78,900 విద్యుత్ కనెక్షన్లు ఇవ్వగా 2,627 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు పెండింగ్‌లో ఉన్నాయి.
– సాక్షి, సిద్దిపేట
బోర్లు, బావుల కింద పంటల సాగుకు రైతులు కరెంట్ కనెక్షన్లు తీసుకుంటున్నారు. 5హెచ్‌పీ మోటార్లకు విద్యుత్ శాఖ కనెక్షన్లు ఇస్తోంది. 5హెచ్‌పీ కనెక్షన్‌కు రైతు రూ.5,350 మీ సేవలో చెల్లించాలి. విద్యుత్ శాఖ ఏఈ, లైన్ ఇన్‌స్పెక్టర్ ద్వారా సర్వే చేస్తారు. లైన్ ఇన్‌స్పెక్టర్ ఇచ్చిన నివేదిక ఆధారంగా అంచనాలు తయారు చేసిన అనంతరం మంజూరు చేస్తారు. ఒక్కో కనెక్షన్‌కు రూ.70వేలు ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుండగా అవసరమగు సామగ్రిని విద్యుత్ శాఖ కొనుగోలు చేసి కాంట్రాక్టర్‌కు అందజేస్తుంది. విద్యుత్ శాఖ అందించే వైర్లు, ట్రాన్స్‌ఫార్మర్లు, ఇతర సామగ్రితో రైతులకు విద్యుత్ కనెక్షన్ ఇస్తారు. ఇంకా అదనంగా అవసరమైతే మళ్లీ డీడీ చెల్లించాలి. ప్రభుత్వం అందించే సబ్సిడీలోనే అంతా సామగ్రి వస్తే అవసరం లేదు.
ఆలస్యాన్ని ఆసరాగా చేసుకుని..
దాదాపు గత ఏడాది నుంచి విద్యుత్ కనెక్షన్‌కు సబ్సిడీ మంజూరు ఆలస్యమవుతుంది. పంటలకు సాగునీటిని అందించకపోతే నష్టపోయే ప్రమాదం ఉండటంతో అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేస్తాం.. విద్యుత్ వైర్ కొనుగోలు చేసి తీసుకవస్తే బిగిస్తాం అని రైతులకు విద్యుత్ అధికారులు చెబుతున్నారు. దీంతో వైర్‌ను కొనుగోలు చేసి కాంట్రాక్టర్లకు ఇస్తున్నారు. ప్రభుత్వం మంజూరు చేసే రూ.70వేల నుంచి కరెంట్ వైర్, ఇతర సామగ్రిని డ్రా చేస్తున్నారు. కానీ వైర్‌ను తిరిగి రైతులకు అందించడం లేదు. ఇలా చాలా ప్రాంతాల్లో కాసుల కోసం విద్యుత్ అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కు అవుతున్నారు. దీంతో రైతుల పై భారమవుతోంది. ఇప్పటికై నా ఉన్నత అధికారులు దృష్టి సారించి అక్రమాలకు చెక్‌పెట్టాలని రైతులు కోరుతున్నారు.
అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కు
రైతుల ఆపదను ఆసరా చేసుకుని మోసం
విద్యుత్ శాఖ వైరు అందించినారైతులకు ఇవ్వని వైనం

కరెంట్ తీగ కాజేస్తుండ్రు