
న్యాయవాదుల రక్షణ చట్టం తేవాల్సిందే
సిద్దిపేటకమాన్: న్యాయవాదులపై జరుగుతున్న దాడులపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వచ్చే శాసనసభ సమావేశాల్లో రక్షణ బిల్లును ప్రవేశపెట్టాలని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జనార్దన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి తాటికొండ రమేష్ డిమాండ్ చేశారు. నాగర్‌కర్నూలులో, నాంపల్లిలో న్యాయవాదులపై జరిగిన దాడికి నిరసనగా సిద్దిపేట కోర్టు ఎదుట న్యాయవాదులు నల్లబ్యాడ్జీలతో శుక్రవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ న్యాయవాదిపై దాడి చేసిన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో న్యాయవాదులు లక్ష్మీనారాయణ, సాయిబాబ, గోవర్ధన్‌రెడ్డి, రవిబాబు, పత్రి ప్రకాష్, ప్రవీణ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
హుస్నాబాద్‌లో నిరసన
హుస్నాబాద్: న్యాయవాదుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తేవాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. నాంపల్లి కోర్టులో అనిల్‌కుమార్ అనే న్యాయవాదిపై దాడిని ఖండిస్తూ శుక్రవారం న్యాయవాదులు తమ విధులు బహిష్కరించి కోర్టు ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల ఆస్తులు, వారి హక్కుల రక్షణ కోసం పోరాడే న్యాయవాదులపై దాడులు చేయడం తగదన్నారు. స్టేషన్ బెయిల్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో న్యాయవాదులు కిరణ్‌కుమార్, కన్నోజు రామకృష్ణ, జుమ్లాల్‌నాయక్, కొత్తపల్లి దేవేందర్, బాలకిషన్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.