
లంచాల కార్యదర్శి మాకొద్దు
అదనపు కలెక్టర్‌కు గ్రామస్తుల ఫిర్యాదు
నంగునూరు(సిద్దిపేట): ప్రతి పనికి పైసలు డిమాండ్ చేస్తున్న పంచాయతీ కార్యదర్శిని తొలగించాలని గట్లమల్యాల గ్రామస్తులు అదనపు కలెక్టర్‌కు మొర పెట్టుకున్నారు. గట్లమల్యాలలో నిర్మించిన ప్రభు త్వ ఆస్పత్రిని శుక్రవారం అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ రేవతి సందర్శించారు. ఈ సందర్భంగా పనుల పురోగతిపై టీఎస్‌ఎంఐడీ ఈఈకి ఫోన్ చేసి ఆరా తీశారు. ఆస్పత్రి భవనం పూర్తయినా వసతులు లేక ప్రారంభానికి నోచుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత కాంట్రాక్టర్‌ను పిలిచి కాంపౌండ్‌వాల్, పెండింగ్ పనులను వారం రోజుల్లో పూర్తి చేయకుంటే టెడర్ రద్దు చేసి కొత్త వారిని పిలుస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు పంచాయతీ కార్యదర్శి లలిత ప్రతి పనికి డబ్బులు డిమాండ్ చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. స్పందించిన అదనపు కలెక్టర్ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని సమాధానం ఇచ్చారు.