
విధుల్లో అలసత్వం తగదు
● విద్యార్థులకు మెనూ ప్రకారంభోజనం అందించాలి
● కలెక్టర్ హైమావతి
సిద్దిపేటరూరల్: విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించడంతోపాటు విధుల్లో అలసత్యం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హైమావతి సిబ్బందిని హెచ్చరించారు. శుక్రవారం మండల పరిధిలోని ఇర్కోడ్ మోడల్ స్కూల్, జూనియర్ కళాశాలను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన ప్రక్రియను పరిశీలించారు. మెనూ ప్రకారం కాకుండా అన్నం, పప్పుచారు, గుడ్డు మాత్రమే అందించినందుకు కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె మాట్లాడుతూ విద్యార్థులకు మెనూ ప్రకారం మిక్స్‌డ్ వెజిటేబుల్ కూర వండాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హాస్టల్ వార్డెన్, సిబ్బందిని హెచ్చరించారు. ప్రాంగణంలోని కిచెన్ గార్డెన్ పరిశీలించి ఆరోగ్యాన్ని కాపాడే మునగ తప్పనిసరిగా పెట్టాలన్నారు. కిచెన్ గార్డెన్ ను బాగా అభివృద్ధి చేయాలని ప్రిన్సిపాల్ రవీందర్‌ను ఆదేశించారు. పాఠశాలలో కుట్టుమిషన్ శిక్షణ ఇస్తున్న క్రమంలో కుట్టు మిషన్ నైపుణ్యం పెంచేలా బాలికలకు శిక్షణ ఇవ్వాలని ట్రెయినీ టీచర్‌కు సూచించారు. అనంతరం విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు.