తపాలా.. ఎందుకిలా? | - | Sakshi
Sakshi News home page

తపాలా.. ఎందుకిలా?

Sep 17 2025 9:12 AM | Updated on Sep 17 2025 9:12 AM

తపాలా.. ఎందుకిలా?

తపాలా.. ఎందుకిలా?

రైల్వే సేవల నుంచి తప్పుకున్న పోస్టల్‌ శాఖ పలుచోట్ల రైల్వే టికెట్‌ బుకింగ్‌ కౌంటర్ల మూసివేత గ్రామీణులకు ప్రయాణ రిజర్వేషన్లు ఇక దూరభారమే

హుస్నాబాద్‌: పలు ప్రాంతాల్లోని పోస్టాఫీసుల్లో రైల్వే టికెట్‌ బుకింగ్‌ కౌంటర్లను ఎత్తేశారు. దీంతో గ్రామీణులకు తిప్పలు తప్పడంలేదు. ప్రముఖ పుణ్య క్షేత్రాలు, టూరిజం స్పాట్లకు వెళ్లాలంటే రైలు ప్రయాణమే శ్రేయస్కరం. రైలు సౌకర్యం లేని సెమీ అర్బన్‌, గ్రామీణ ప్రాంతాల ప్రజల సౌలభ్యం కోసం ఎంపిక చేసిన పోస్టాఫీసుల్లో రైల్వే టికెట్‌ బుకింగ్‌ కౌంటర్లు పని చేస్తున్నాయి. భారత రైల్వేలు, పోస్టల్‌ శాఖ సమన్వయంతో ఇండియా పోస్ట్‌ ప్యాసింజర్‌ రైల్వే సిస్టమ్‌ (ఐపీపీఆర్‌ఎస్‌) ప్రవేశపెట్టారు. రైల్వే శాఖ, పోస్టల్‌ శాఖ సమన్వయంతో హుస్నాబాద్‌ సబ్‌ పోస్టాఫీస్‌లో రైల్వే టికెట్‌ బుకింగ్‌ కౌంటర్‌ను ఏర్పాటు చేశారు. ఈ కౌంటర్‌ ద్వారా రైతులు, విద్యార్థులు, సీనియర్‌ సిటిజన్లు వివిధ ప్రాంతాలు, దేవస్థానాలకు వెళ్లేందుకు టికెట్‌ బుకింగ్‌ చేసుకొనే ప్రయోజనం ఉంది. అయితే దేశ వ్యాప్తంగా ఎంపిక చేసిన పోస్టాఫీసులకు గాను 134 సెంటర్లల్లో రైల్వే టికెట్‌ బుకింగ్‌ కౌంటర్లను ఎత్తివేశారు. ఇందులో తెలంగాణలో హన్మకొండ, భూపాల్‌పల్లి, హుస్నాబాద్‌, వనపర్తి, సూర్యాపేట, సిద్దిపేట, సంగారెడ్డి సబ్‌ ఫోస్టాఫీస్‌లు ఉన్నాయి.

గ్రామీణ ప్రాంత వాసులకు తిప్పలు

హుస్నాబాద్‌ సబ్‌ పోస్టాఫీస్‌లోని టికెట్‌ కౌంటర్‌ నుంచి రోజు విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం, ఢిల్లీ, ముంబయి నగరాలకు రైల్వే రిజర్వేషన్లకు టికెట్లను బుక్‌ చేసుకుంటారు. కరీంనగర్‌, వరంగల్‌ ప్రాంతాల ప్రజలు కూడా ఇక్కడేకే వచ్చి రైల్వే రిజర్వేషన్‌ చేసుకుంటారు ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలు పట్టణాలు, నగరాలకు వెళ్లకుండా స్థానిక పోస్టాఫీస్‌లోని రిజర్వేషన్ల బుకింగ్‌ కౌంటర్‌ ద్వారా టికెట్లు తీసుకుంటున్నారు. ఇక్కడ ఉన్న కౌంటర్‌ను మూసివేయడంతో పట్టణాల్లో కానీ, ఆన్‌లైన్‌లో రైల్వే రిజరేషన్లు బుక్‌ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

టార్గెట్‌ పూర్తికాకపోవడంతో..

పోస్టాఫీస్‌లో ఏర్పాటు చేసిన ఐపీపీఆర్‌ఎస్‌ సెంటర్‌ ద్వారా రోజు 10 టికెట్లు తగ్గకుండా ఎక్కువగా రిజర్వేషన్లు బుక్‌ చేసుకోవాలని టార్గెట్‌ విధించారు. కానీ 5 నుంచి 6 మాత్రమే ఎప్పుడో ఒక్కసారి 10 లోపు టికెట్లు బుక్‌ చేసుకునే పరిస్థితి. దీంతో టార్గెట్‌ పూర్తికావడం లేదని పోస్టల్‌ శాఖ భావించింది. అలాగే సిబ్బంది కొరత, ఇతరత్రా సమస్యలతో రైల్వే టికెట్‌ బుకింగ్‌ కౌంటర్‌ భారమని పోస్టల్‌ శాఖ కౌంటర్లను ఎత్తివేసినట్లు తెలుస్తోంది. రైల్వే బుకింగ్‌ వల్ల పోస్టాఫీస్‌కు సంబంధించిన పథకాలు, లావాదేవీలకు ఆటంకం కలుగుతుందని సమాచారం. అందుకే రైల్వే సేవల నుంచి పోస్టల్‌ శాఖ తప్పుకుంది. హుస్నాబాద్‌ పోస్టాఫీస్‌లో రైల్వే టికెట్‌ బుకింగ్‌ కౌంటర్‌ను పునరుద్ధరించాలని కేంద్ర మంత్రి బండి సంజయ్‌కి మంత్రి పొన్నం ప్రభాకర్‌ లేఖ రాసిన విషయం విదితమే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement