
వైద్య సేవల్లో అలసత్వం తగదు
● కలెక్టర్ హైమావతి ● జగదేవ్‌పూర్‌లో పర్యటన
జగదేవ్‌పూర్(గజ్వేల్): వైద్య సేవల్లో అలసత్వం తగదని కలెక్టర్ హైమావతి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు. ఆస్పత్రిలో వైద్య సేవలు అందుతున్నాయా?..అంటూ ఆస్పత్రికి వచ్చిన వృద్ధురాలితో కలెక్టర్ ఆరా తీశారు. ప్రభుత్వ ఆస్పత్రిలోనే వైద్యం చేయించుకోవాలని సూచించారు. వైద్యులు సూచించిన విషయాలను తప్పనిసరిగా పాటించాలన్నారు. ఆస్పత్రి రికార్డులను తప్పనిసరిగా అమలు చేయాలని, రోగుల వివరాలను నమోదు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కలెక్టర్‌కు వైద్యురాలు బీపీ, షుగర్ చూసి సాధారణంగా ఉందని తెలిపారు.
భూ భారతి సమస్యలు పరిష్కరించాలి
తహసీల్దార్ కార్యాలయంలో భూ భారతి దరఖాస్తుల తీరు తెన్నులపై ఆరా తీశారు. భూ సమస్యలపై వచ్చిన దరఖాస్తులను భూ భారతి నిబంధనల మేరకు క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని సిబ్బందికి సూచించారు. అలాగే దౌలాపూర్‌లో ఇందిరమ్మ నిర్మాణ పనులను పరిశీలించారు. ఇళ్ల నిర్మాణ పనుల్లో వేగవంతం చేయాలని అధికారులకు అదేశించారు. కార్యక్రమంలో ఆర్డీఓ చంద్రకళ, తహశీల్దార్ నిర్మల, ఎంపిడిఓ రాంరెడ్డి, వైద్యుడు సత్యప్రకాష్, కార్యదర్శి రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.