
పకడ్బందీగా స.హ.చట్టం
సమాచారం అడిగేందుకు ఆర్టీఐ వజ్రాయుధం రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి కలెక్టరేట్‌లో పీఐఓలకు అవగాహన
సిద్దిపేటరూరల్: సమాచార హక్కు చట్టాన్ని అధికారులు కట్టుదిట్టంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని మీటింగ్ హాల్‌లో సమాచార హక్కు చట్టంపై పీఐఓలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా ప్రధాన సమాచార కమిషనర్ జి.చంద్రశేఖర్‌రెడ్డి, కమిషనర్లు అయోధ్యరెడ్డి, దేశాల భూపాల్, పీవీ శ్రీనివాసరావు, మెహసిన పర్వీన్‌లు కలెక్టర్ హైమావతి, సీపీ అనురాధ, అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్‌లతో కలిసి పాల్గొన్నారు. చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో సమాచార హక్కు చట్టం ద్వారా తక్కువ దరఖాస్తులు పెండింగులో ఉన్నాయని, దీనికి కృషి చేసిన జిల్లా యంత్రాంగాన్ని అభినందించారు. రాష్ట్రంలో 17,000 దరఖాస్తులు పెండింగ్ ఉన్న సందర్భంగా వాటిని పరిష్కరించి జీరోగా మార్చేందుకే జిల్లాల్లో పర్యటిస్తున్నామన్నారు. రాష్ట్రంలో ప్రతి ఏటా లక్షా 50 వేల మంది సమాచార హక్కు చట్టం ద్వారా సమాచారం అడుగుతున్నారన్నారు. తెల్లరేషన్ కార్డ్ దారుడు ఉచితంగా సమాచారాన్ని పొందవచ్చన్నారు. ఇతరులు 10 రూపాయల కోర్ట్ ఫీ ద్వారా చెల్లించి సమాచారం పొందవచ్చన్నారు. పౌర సేవలు ఏ సమయంలో అందించాలి, అధికారుల వివరాలను తెలిపే సైన్ బోర్డ్‌లను ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి కార్యాలయంలో పీఐఓ, ఏపీఐఓలు దరఖాస్తులు స్వీకరించి సమాచారం అందించాలని సూచించారు. చట్టంపై అధికారులందరికీ సమగ్రమైన అవగాహన కల్పించి పటిష్టంగా అమలు జరిగేలా ఆర్టీఐ కమిషన్ లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఈ సందర్భంగా చట్టంపై పీఐఓ,ఏపీఐ లకు ఉన్న సందేహాలను నివృత్తి చేశారు.
అనంతరం సమాచార హక్కు చట్టం కమిషనర్ అయోధ్యరెడ్డి మాట్లాడుతూ ఆర్టీఐ చట్టాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళేందుకు వారథులుగా ప్రభుత్వ అధికారులు సిబ్బంది పని చేయాలన్నారు. తప్పుడు సమాచారం అందించినా, ఆలస్యం చేసినా ఆర్ట్టీఐ చట్టం ప్రకారం కమిషన్ చర్యలు తీసుకుంటుందన్నారు. అధికారులు అనవసరంగా భయాందోళనలకు గురై సమాచారాన్ని దాచి పెట్టాల్సిన అవసరం లేదన్నారు. అనంతరం కలెక్టర్ హైమావతి మాట్లాడుతూ ప్రభుత్వ పాలనలో పారదర్శకత, అధికారుల్లో జవాబుదారీతనాన్ని పెంచేందుకు సమాచార హక్కు చట్టం చాలా దోహదం చేస్తుందన్నారు. జిల్లాలో ఆర్టీఐ దరఖాస్తులు పెండింగ్‌లో లేకుండా ప్రత్యేకంగా పర్యవేక్షిస్తామన్నారు. జిల్లాలో పెండింగ్ ఉన్న 170 కేసులను కమిషన్ సభ్యులు శాఖల వారీగా పరిశీలించి పరిష్కరించారు. కార్యక్రమంలో ఆర్డీఓలు, ఏసీపీలు, వివిధ ప్రభుత్వ కార్యాలయాల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

పకడ్బందీగా స.హ.చట్టం