
కమలంలో కుంపట్లు
జిల్లా భారతీయ జనతాపార్టీ(బీజేపీ)లో నేతల మధ్య వర్గపోరు తారస్థాయికి చేరుకుంటోంది. సమన్వయం కొరవడి పార్టీలో ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరిస్తుండటంతో కార్యకర్తలు అయోమయానికి గురువుతున్నారు. ఆరు నెలల క్రితం బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా బైరీ శంకర్‌ను రాష్ట్ర పార్టీ ప్రకటించింది. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి జిల్లా అధ్యక్ష పదవిని కట్టాబెట్టారని అప్పటి నుంచి పలువురు అసంతృప్తిని వ్యక్తం చేస్తూవస్తున్నారు. అధిష్టానానికి ఫిర్యాదులు, సోషల్ మీడియాలో బహిరంగంగా విమర్శలు చేసే వరకు వెళ్లింది.
– సాక్షి, సిద్దిపేట
జిల్లా బీజేపీ మూడు వర్గాలుగా విడిపోయింది. ప్రస్తుత అధ్యక్షుడు బైరీ శంకర్, మాజీ అధ్యక్షుడు గంగాడి మోహన్‌రెడ్డి, దూది శ్రీకాంత్‌రెడ్డి ఒకరికొకరు అంటి ముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. జిల్లా అధ్యక్షుడి ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాలకు మోహన్‌రెడ్డి వర్గం దూరంగా ఉంటోంది. పార్టీ కార్యక్రమాల్లో ఎంపీ రఘునందన్ రావు పాల్గొనే వాటికి మాత్రమే శ్రీకాంత్‌రెడ్డి వర్గం పాల్గొంటోంది. మిగతావాటికి దూరంగానే ఉంటున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, రాష్ట్ర ఇన్‌చార్జి చంద్రశేఖర్ జీకి పలువురు ఫిర్యాదు చేశారు. ఎంపీ ఎన్నికల్లో సిద్దిపేట నియోజకవర్గం నుంచి రఘునందన్ రావుకు అధికంగా ఓట్లు వచ్చాయి. జిల్లాలో పార్టీ బలోపేతం అవుతున్న సమయంలో నేతల వర్గపోరుతో కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.
పెండింగ్‌లోనే జిల్లా కార్యవర్గం
జిల్లా కార్యవర్గాన్ని ఇంకా పెండింగ్‌లోనే పెట్టారు. జిల్లా అధ్యక్షుడిని నియమించి ఆరు నెలలు కావస్తున్నా జిల్లా కమిటీ ఏర్పాటు కాలేదు. దీంతో అధ్యక్షుడి మార్పు ఉంటుందని కార్యకర్తలు జోరుగా చర్చించుకుంటున్నారు.
అధిష్టానం దృష్టి సారించేనా?
జిల్లాపై బీజేపీ అధిష్టానం ప్రత్యేక దృష్టి పెట్టి వర్గపోరును కట్టడి కోసం చర్యలు తీసుకుంటుందా? లేదా అన్న చర్చ కార్యకర్తల్లో జోరుగా సాగుతోంది. ఇదే విధంగా వర్గపోరు ఉంటే త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయని పలువురు కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. బీజేపీ అధిష్టానంతో పాటు, ఎంపీ రఘునందన్ రావు ప్రత్యేక దృష్టి కేంద్రికరించి వర్గపోరు నియంత్రించి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కార్యకర్తలు కోరుతున్నారు.
ఫోన్ కాల్ సంభాషణ..
‘ఏ పార్టీ నుంచైనా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓ సామాజిక వర్గం వారు పోటీ చేస్తే వారికి ఆర్థిక సాయం అందించాలి. మధన్న(కాంగ్రెస్) వెనకాల టీం ఉంటే ఉపయోగంగా ఉంటుంది’ అని ఓ వ్యక్తితో జిల్లా అధ్యక్షుడు ఫోన్‌లో మాట్లాడిన సంభాషణ కలకలం రేపుతోంది. ఈ ఆడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కులం పేరుతో పార్టీకి వెన్నుపోటు పోడిచే విధంగా ఉందని పలువురు కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా ఆరోపిస్తున్నారు. ఇటీవల రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును జిల్లా అధ్యక్షుడు బైరీ శంకర్‌తో పాటు పలువురు కలిసి ఈ ఫోన్ కాల్ సంభాషణపై వివరణ ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం.
మూడు వర్గాలుగా విడిపోయిన నేతలు
జిల్లా అధ్యక్షుడిపై అధిష్టానానికి ఫిర్యాదు
ఇంకా ఖరారుకాని జిల్లా కార్యవర్గం
ఫోన్ కాల్ సంభాషణ
సోషల్ మీడియాలో వైరల్
అయోమయంలో క్యాడర్