
బినామీల దందా!
ఎస్సీ కార్పొరేషన్‌కు చెందిన దుకాణాల అద్దె వ్యవహారంలో బినామీల దందా కొనసాగుతోంది. కొందరు రాజకీయ పలుకుబడిని ఉపయోగించి 15 ఏళ్లుగా అద్దెను పెంచనివ్వకుండా ఎస్సీ కార్పొరేషన్ ఖజానాకు గండి కొడుతున్నారు. తక్కువ అద్దెకు షెట్టర్లను తీసుకొని అధిక అద్దెలకు వ్యాపారులకు ఇచ్చి ఏటా రూ. లక్షకు పైగా ఆదాయం పొందుతున్నారు. ఇతరులకు అక్రమంగా అద్దెలకు ఇచ్చి ఆదాయం పొందుతున్నా.. కొన్నేళ్లుగా అద్దెలు చెల్లించకపోయినా అడిగే నాథుడే కరువయ్యారు.
– సాక్షి, సిద్దిపేట
ఎస్సీల అభివృద్ధి కోసం స్వయం కృషి పథకంలో భాగంగా 1989–90లో ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా తొమ్మిది చోట్ల 50షెట్టర్లను నిర్మించారు. సిద్దిపేటలో ఐదు, దుబ్బాకలో 10, గజ్వేల్‌లో ఐదు, తిమ్మాపూర్‌లో 5, జగదేవ్‌పూర్‌లో 5, కొండపాకలో 5, లింగారెడ్డిపల్లిలో 5, మద్దూరులో 5, లచ్చపేటలో ఐదు షెట్టర్లు ఉన్నాయి. వీటిని 19 నుంచి 45 సంవత్సరాల లోపు ఎస్సీలకు అద్దెలకు ఇచ్చి స్వయం ఉపాధి కల్పించారు. 2008లో పట్టణాల్లో అయితే రూ.600 నుంచి రూ.800, గ్రామ పంచాయతీల్లో రూ.400 అద్దెగా నిర్ణయించారు.
మార్కెట్ ధర ప్రకారం 5శాతమే అద్దె
2008 నుంచి కొందరు అద్దెను చెల్లించడమే బంద్ చేశారు. దాదాపు 15 ఏళ్లుగా వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. మరి కొందరు ఇతరులకు అక్రమంగా అద్దెకు ఇచ్చి అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. కానీ ఎస్సీ కార్పొరేషన్‌కు అద్దె మాత్రం చెల్లించడంలేదు. ఇటీవల అధికారులు నోటీసులు ఇవ్వడంతో కొంత చెల్లించారు. మార్కెట్ ధర ప్రకారం అద్దెను చూస్తే కనీసం 5శాతం సైతం లేని అద్దెను సకాలంలో చెల్లించడం లేదు. 2008లో నిర్ణయించిన ప్రకారం చూస్తే సిద్దిపేటకు చెందిన షెట్టర్లు రూ.7.20లక్షలు చెల్లించాలి. కానీ ఇప్పటి వరకు రూ2.77లక్షలు మాత్రమే చెల్లించారు. గజ్వేల్‌లో రూ.3.60లక్షలు చెల్లించాల్సి ఉన్నా చెల్లించింది రూ.1.95లక్షలే. దుబ్బాకలో రూ.10లక్షలకు గాను రూ.6.7లక్షలు మాత్రమే చెల్లించారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి అద్దెను సవరించి, పాత బకాయిలను వసూలు చేయాలని, బినామీలకు షెట్టర్లను రద్దు చేసి నిరుద్యోగ ఎస్సీ యువతకు అందించాలని కోరుతున్నారు.
సిద్దిపేట పట్టణంలో మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట ఐదు షెట్టర్లను ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్మించారు. వాటిని ఎస్సీలకు కేటాయించారు. 2008లో రూ.800 అద్దెగా నిర్ణయించారు. అప్పటి నుంచి అంతే అద్దెకు కొనసాగుతోంది. వీటిలో రెండు షెట్టర్లను కేటాయించిన వారు కాకుండా ఇతరులకు అద్దెకు ఇచ్చి ఎక్కువగా వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. వీటికి సమీపంలోనే మున్సిపాలిటీకి సంబంధించిన షెట్టర్లు ఉండగా వాటికి ఒక్కోదానికి రూ.12వేల నుంచి రూ.14వేలు వసూలు చేస్తున్నారు.
దుబ్బాక పట్టణంలో ఎంపీడీఓ కార్యాలయం వద్ద పది షెట్టర్లను ఎస్సీ కార్పొరేషన్ నిర్మించి అద్దెకు ఇచ్చింది. 2008లో ఒక్కో షెట్టర్‌కు రూ. 600గా నిర్ణయించారు. అప్పటి నుంచి అద్దెను పెంచలేదు. ఇందులో దాదాపు నలుగురు ఇతరులకు అక్రమంగా అద్దెకు ఇచ్చి అధిక డబ్బులు వసూలు చేస్తున్నారు. అక్కడ సాధారణంగా ఒక్కో షెట్టర్‌కు రూ.8వేల నుంచి రూ.10వేలు అద్దె ఉంది.
ఇతరులకు ఇచ్చిన వారిపై చర్యలు
త్వరలో అద్దెలను పెంచుతాం. షెట్టర్లలో అద్దెకు ఉంటున్న వారికి నోటీసులు ఇచ్చాం. దీంతో దాదాపు రూ.11లక్షల వరకు అద్దె వసూలు చేశాం. కొన్ని శిథిలావస్థకు చేరాయి. వాటిని మరమ్మతులు చేయిస్తాం. కేటాయించిన వారు కాకుండా ఇతరులకు అద్దెలకు ఇచ్చిన వారిపై చర్యలు తీసుకుంటాం.
– భార్గవ్, ఈడీ, ఎస్సీ కార్పొరేషన్
ఎస్సీ కార్పొరేషన్ దుకాణాల అద్దెలో గోల్‌మాల్
15 ఏళ్లుగా కిరాయి చెల్లించని
లబ్ధిదారులు
అక్రమంగా ఇతరులకు కేటాయింపు
అధిక కిరాయి వసూలు
కార్పొరేషన్ ఖజానాకు గండి