వణికిస్తున్న జబ్బు.. ఆస్పత్రులు గబ్బు.. | - | Sakshi
Sakshi News home page

వణికిస్తున్న జబ్బు.. ఆస్పత్రులు గబ్బు..

Sep 9 2025 1:35 PM | Updated on Sep 9 2025 1:35 PM

వణికిస్తున్న జబ్బు.. ఆస్పత్రులు గబ్బు..

వణికిస్తున్న జబ్బు.. ఆస్పత్రులు గబ్బు..

చీటిలకూ పడిగాపులే..

ఓ వైపు వణికిస్తున్న జబ్బు.. మరోవైపు ఆస్పత్రుల్లోని కంపుతో రోగులు బెంబేలుచెందుతున్నారు. అసలే

జ్వరాల సీజన్‌ కావడంతో ఆస్పత్రులన్నీ రోగులతో కిటకిటలాడుతున్నాయి. వైద్యం కోసం ఓపీ కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. ఓపీ కేంద్రం నుంచి వైద్యం చేయించుకునే వరకు రోగులు పడుతున్న అవస్థలు అన్నీఇన్నీకావు.. సాక్షాత్తు జిల్లా కేంద్రంలోని జనరల్‌ ఆస్పత్రిలో రోగుల ముక్కులు పగిలిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. ఓ వైపు జబ్బు తగ్గించుకుందామని ఆస్పత్రికి వస్తే.. ముక్కు పుఠాలు ముక్కలయ్యేలా కంపు కొడుతోంది. దీంతో ఆస్పత్రులకు వచ్చిన రోగులు, వారికి తోడుగా వచ్చిన సహాయకులు.. కొత్త రోగాల బారిన పడుతుండటం గమనార్హం. ఇక పట్టణ ఆస్పత్రుల్లో అరకొర మందులు.. వైద్య సిబ్బంది కొరతతో అవస్థలు తప్పడంలేదు. సోమవారం పట్టణ ఆస్పత్రులను సాక్షి విజిట్‌ చేయగా పలు విషయాలు వెలుగుచూశాయి.

గజ్వేల్‌రూరల్‌: రోగమొస్తే ప్రభుత్వాస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకుందామనుకునే ప్రజలు.. వైద్యుల వద్దకు వెళ్లేముందు తీసుకునే టోకెన్ల(చీటి) కోసమే పడిగాపులు కాయాల్సి వస్తోంది. అంతేగాకుండా వైద్యులు సైతం సమయపాలన పాటించడం లేదనే ఆరోపణలు సైతం ఉన్నాయి. గజ్వేల్‌ పట్టణంలో జిల్లా ప్రభుత్వాస్పత్రితో పాటు మాతాశిశు సంరక్షణ ఆస్పత్రులను ప్రభుత్వం వేర్వేరుగా ఏర్పాటు చేసింది. జిల్లా ప్రభుత్వాసుపత్రిలో జనరల్‌ వ్యాధులతో పాటు పీడియాట్రిక్‌, ఆప్తమాలజీ, ఆర్థోపెడిక్‌ తదితర చికిత్సలను అందిస్తుండగా, మాతా శిశు సంరక్షణ ఆసుపత్రిలో గర్భిణులకు వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ రెండు ఆస్పత్రులలో నిత్యం సుమారు 700 నుంచి 900 మంది వైద్యం కోసం వస్తుంటారు. అయితే జిల్లా ప్రభుత్వాసుపత్రిలో వైద్యుని వద్దకు వెళ్లేకంటే ముందు టోకెన్‌(చీటి) తీసుకోవడానికి సుమారు అరగంటకుపైగా క్యూలైన్లో పడిగాపులు కాయాల్సి వస్తుందని వాపోతున్నారు. అంతేగాకుండా వైద్యులు సైతం సమయపాలన పాటించడం లేదని ఆసుపత్రికి వచ్చే వారు ఆరోపిస్తున్నారు. వైద్యం సకాలంలో అందడంలేదని చెబుతున్నారు.

కంపుకొడుతున్న పెద్దాస్పత్రి

సిద్దిపేటకమాన్‌: సిద్దిపేట ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో చెత్త, వ్యర్థాలు పేరుకుపోవడంతో దుర్గంధం వ్యాపిస్తోంది. దీంతో ఆస్పత్రికి వస్తే వ్యాధి నయమవడం ఏమో కానీ వ్యాధుల బారీన పడే అవకాశం ఉందని పలువురు వాపోతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రతి నిత్యం పలు విభాగాల్లో 1600మంది ఓపీ సేవలు పొందుతున్నారు. ఇందులో వైరల్‌ ఫీవర్‌ వారు ఎక్కువగా ఉన్నారు. నెల రోజుల్లో 37మంది డెంగీ బారీన పడ్డారు. జనరల్‌ మెడిసిన్‌, పిడియాట్రిక్‌, గైనకాలజీ విభాగాల ఓపీ వద్ద రోగులు క్యూ కట్టారు. ప్రస్తుతం ఇన్‌ పేషెంట్‌ విభాగంలో 256 మంది చికిత్స పొందుతున్నారు. రోగులను తీసుకెళ్లాల్సిన స్ట్రెచర్‌ పైన సిబ్బంది మందులు తీసుకెళ్తుండటం గమనార్హం. ఆస్పత్రిలో శానిటేషన్‌, వైద్య సేవలపై ఆర్‌ఎంఓను సంప్రదించగా చెత్త తీసుకెళ్లే వాహనం రిపేర్‌ వల్ల రాలేదని, మున్సిపల్‌ సిబ్బందితో మాట్లాడి చెత్తను తొలగిస్తామని, ఆస్పత్రిలో అన్ని విభాగాల్లో వైద్య సేవలందుతున్నాయని, మందులు కూడా అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

డాక్టర్లు అరకొర.. రోగులు కిటకిట

హుస్నాబాద్‌: వైరల్‌ ఫీవర్‌తో రోగులు ఆస్పత్రులకు పరుగులు పెడుతున్నారు. వాతావరణంలో వస్తున్న మార్పులతో జ్వరాలు విజృంభిస్తున్నాయి. హుస్నాబాద్‌ పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రి సోమవారం రోగులతో కిటకిటలాడాయి. 419 మంది వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఇందులో 83 మందికి వైరల్‌ ఫీవర్‌గా గుర్తించారు. 24 మంది జ్వర పీడితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రోజు రోజుకు జ్వరాలు పెరగడంతో రోగులతో ఆస్పత్రి కిటకిటలాడుతోంది. ఉదయాన్నే రోగులు క్యూలైన్లు కట్టారు. ఆస్పత్రిలో 16 డాక్టర్ల పోస్టులకు గాను ఏడుగురు డాక్టర్లు మాత్రమే ఉన్నారు. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరూ జ్వరాలతో బాధపడుతున్నారు.

వైద్యం దైవాదీనం

ఓపీ కేంద్రాల వద్ద రోగులు బారులు గంటల తరబడి నిరీక్షణ

అరకొర మందులు.. వేధిస్తున్న సిబ్బంది కొరత ఎవరికీ పట్టని పేదల గోస

సాక్షి విజిట్‌లో వెలుగుచూసిన వాస్తవాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement