
జీఓ 99 సవరించాల్సిందే
హుస్నాబాద్: ఎస్సీ వర్గీకరణ కంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీఓ నంబర్ 99 అత్యంత ప్రమాదకరమని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ అన్నారు. సోమవారం మాల మహానాడు పిలుపు మేరకు మాలలు చేపట్టిన ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయ ముట్టడిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వ్యవసాయ మార్కెట్ యార్డు గేట్ వద్ద జీఓ ప్రతులను దహనం చేశారు. ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ ఈ జీవో వల్ల మాలల విద్యార్థులకు విద్య, ఉద్యోగ సీట్లల్లో తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. రోస్టర్ విధానంలో 22 నుంచి 16కు తగ్గించాలని డిమాండ్ చేశారు. జీఓ నంబర్ 99ని సవరించే వరకు పోరాటం ఆగదన్నారు. అనంతరం మంత్రి పీఏకి వినతి పత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం నియోజకవర్గ ఇన్‌చార్జి ఆరె కిషోర్, నాయకులు వెన్న రాజు, దండి లక్ష్మి తదితరులు ఉన్నారు.
ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ ముట్టడి
దుబ్బాక: ఏబీసీడీ వర్గీకరణతో మాలలకు తీరని అన్యాయం జరుగుతుందని మాలమహానాడు నేతలు మండిపడ్డారు. ఈ మేరకు సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని నాయకులు ముట్టడించారు. క్యాంపు ఆఫీసు గేట్ ఎదుట బైఠాయించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి లేక పోవడంతో పీఏకు వినతి పత్రం అందించారు. జీఓ 99 ను రద్దుచేయాలని, ఏబీసీడీ వర్గీకరణతో మాలలకు జరుగుతున్న అన్యాయాన్ని అసెంబ్లీలో మాట్లాడాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. క్యాంపు కార్యాలయం ముట్టడించిన మాలమహానాడు నాయకులను పోలీసులు అక్కడినుంచి బలవంతంగా పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కార్యక్రమంలో మాలమహానాడు దుబ్బాక నియోజకవర్గం ఇన్‌చార్జి కాల్వ నరేష్, అంబేడ్కర్ సంఘం అధ్యక్షుడు కాల్వ లింగం, ఆస రాజశేఖర్, శ్రీనివాస్, రాజేష్, ప్రభాకర్, శేఖర్‌రావు, నారాయణ తదితరులు ఉన్నారు.
మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు సుధాకర్