
సారొస్తారంటేనే హడల్
సదరు అధికారి క్షేత్రస్థాయి పర్యటనలకు వస్తున్నారంటేనే ఆ శాఖ సిబ్బంది హడలెత్తిపోతున్నారు. తన శాఖకు చెందిన ఆస్పత్రుల్లో తనిఖీలకు వెళితే.. బిర్యానీ, సిగరేట్ డబ్బా, చేతిలో ఒక కవర్, మద్యం బాటిల్ ఇవ్వాలని హుకుం జారీ చేస్తారు. ఏర్పాట్లు చేయకపోతే సార్ కోపానికి వస్తాడేమోనని.. చేసేదేమిలేక సర్దుబాటు చేస్తున్నారు. గొర్రెల పెంపకం అబివృద్ధి పథకం (ఎస్‌ఆర్‌డీఎస్) కింద రాష్ట్ర ప్రభుత్వం గతంలో నిధులు మంజూరు చేసింది. ఈ పథకంపై ఇప్పటికే సీబీఐ విచారణ జరిగింది, ఈడీకి ఈ కేసును అప్పగించిన విషయం తెలిసిందే. ఈ పథకానికి సంబంధించిన డబ్బులు డ్రా చేయవద్దని ఇదివరకే ఉన్నతాధికారులు అదేశించారు. అయితే.. కార్యాలయంలో ఫర్నిచర్ కోసం ఎస్‌ఆర్‌డీఎస్ డబ్బులు రూ.2లక్షలు సెల్ఫ్ డ్రా చేసినట్లు తెలిసింది. నిబంధనలకు విరుద్ధంగా చెక్ రాయలేమని ఆ సెక్షన్ అధికారి తనకు ఈ బాధ్యతలు వద్దని రాసిచ్చి వెళ్లినట్లు తెలిసింది. దీంతో మరో సీనియర్ అసిస్టెంట్ ద్వారా చెక్ రాయించుకొని డ్రా చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఇలా కింది స్థాయి ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేస్తుండటంతో త్వరలో జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిసింది. కాగా, సదరు అధికారిని వివరణ కోరగా.. మధ్యాహ్నం సమయంలో విశ్రాంతి తీసుకునేందుకు చాపను ఏర్పాటు చేసుకున్నాని, కార్యాలయంలో ఉండటం లేదని సమాధానం ఇచ్చారు.