
అధికారుల్లో కదలిక
ముంచెత్తిన ముంపుతో అలర్ట్
ముంచెత్తిన ముంపుతో అధికారుల్లో కదలిక వచ్చింది. భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలన్నీ ముంపునకు గురైన నేపథ్యంలో బల్దియా దిద్దుబాటుకు శ్రీకారం చుట్టింది. కోమటి చెరువు ఫీడర్ ఛానల్ ఇరువైపులా నాలాలు కబ్జాకు గురికావడం.. నిర్మించిన అక్రమ కట్టడాలపై దృష్టి సారించింది. ఈ క్రమంలో భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా ఫీడర్ ఛానల్ ప్రక్షాళన దిశగా మూడు శాఖలు (మున్సిపల్, రెవెన్యూ, ఇరిగేషన్) అడుగులు వేస్తున్నాయి. ఇరిగేషన్ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టిన వాటిని గుర్తించారు. ఇప్పటికే 15 నిర్మాణాలకు బల్దియా అధికారులు నోటీసులు జారీ చేశారు. – సిద్దిపేటజోన్
ముంపు నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణపై మూడు శాఖల అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మరోవైపు జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ముందుకు సాగేలా యంత్రాంగం సమాలోచన చేస్తోంది. జిల్లా కేంద్రంలోని కోమటి చెరువు మత్తడికి పురాతన చరిత్ర ఉంది. ఎగువ భాగాన ఉన్న ఆయా చెరువుల నీటి ప్రవాహం కోమటి చెరువు ద్వారా కెనాల్ గుండా దిగువ భాగంలోని నర్సాపూర్ చెరువులోకి వెళ్తుంది. ఈ క్రమంలో గత ప్రభుత్వ హయాంలో సుమారు మూడు కిలోమీటర్ల పొడవునా కోమటి చెరువు ఫీడర్ ఛానల్ ఆధునీకరణ జరిగింది. కోమటి చెరువు గరిష్ట నీటి మట్టం దాటిన క్రమంలో నీటి ప్రవాహం మత్తడి దూకి నర్సాపూర్ చెరువుకు ఫీడర్ ఛానల్ ద్వారా వెళ్తుంది. ఈ నేపథ్యంలో ఇటీవల మునుపెన్నడూ లేనంత భారీ వర్షాలు కురవడంతో పెద్ద ఎత్తున వరదతో కోమటి చెరువు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. కాలనీలు జలదిగ్బంధంలో ఉన్నాయి.
ఫీడర్ ఛానల్ లక్ష్యంగా ప్రణాళికలు
భవిష్యత్తు తరాల కోసం అడుగులు
అక్రమ కట్టడాలపై నజర్
ఇప్పటికే 15 నిర్మాణాలకు నోటీసులు