
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
● రోగులకు మెరుగైన సేవలందించాలి
● కలెక్టర్ హైమావతి
● వేళలు పాటించని డాక్టర్లపై ఆగ్రహం
మద్దూరు(హుస్నాబాద్): విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ హైమావతి వైద్యాధికారులకు సూచించారు. ఆదివారం లద్నూరు గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు. రోగులకు అందుతున్న సేవలను పరిశీలించారు. కలెక్టర్ సందర్శించినపుడు ఆస్పత్రిలో స్టాఫ్ నర్సు, అటెండర్ మాత్రమే విధుల్లో ఉన్నారు. వైద్యాధికారులు అందుబాటులో లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డాక్టర్లు క్రమం తప్పకుండా విధులకు వస్తున్నారా? లేదా అని అక్కడున్న సిబ్బందిని ప్రశ్నించారు. మెడికల్ ఆఫీసర్ రాసే ఓపీ రిజిస్టర్ ఎవ్వరికీ అర్థం కాకుండా రాస్తే ఏం ఉద్యోగం చేస్తున్నట్లు అని అసహనం వ్యక్తం చేశారు. డీఎంహెచ్‌ఓకు రిజిస్టర్ లు చూపించి కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. రోగులతో మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలోనే వైద్యం చేయించుకోవాలని సూచించారు. పీహెచ్‌సీ మరమ్మతు పనులను పరిశీలించారు. స్లాబ్ పైన నీరు నిలవకుండా చూడాలన్నారు. ప్లంబింగ్ ఇతరత్ర పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించాలన్నారు. మద్దూరు ఏంపీడీఓ, మండల కేంద్రంలో, గ్రామాల్లో ఓటరు జాబితా పై అభ్యంతరాలు స్వీకరణను క్షేత్రస్థాయిలో కలెక్టర్ పరిశీలించారు.
‘తపాస్‌పల్లి’ భూములు ఆక్రమిస్తే చర్యలు
కొమురవెల్లి(సిద్దిపేట): మండలంలోని తపాస్‌పల్లి రిజర్వాయర్ భూములు ఆక్రమిస్తే చర్కలు తీసుకుంటామని కలెక్టర్ హైమావతి హెచ్చరించారు. ఆదివారం తపాస్‌పల్లి రిజర్వాయర్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా రిజర్వాయర్ సామర్థ్యం, నీటి పంపింగ్, లభ్యతపై ఆరా తీశారు. అనంతరం ఆమె మట్లాడుతూ రిజర్వాయర్ భూములు కబ్జాకు గురికాకుండా రెవిన్యూ అధికారులు చూడాలన్నారు. కట్టపై ఉన్న పిచ్చిమొక్కలను వెంటనే తొలగించాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు. అలాగే రిజర్వాయర్ ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్న భూములపై కూడా ప్రత్యేక దృష్టి సారించాలనిన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఐ రాజు, ఆర్‌ఐ శ్రీనివాస్ పాల్గొన్నారు.