
హామీలు విస్మరించిన సర్కార్
తపస్ జిల్లా అధ్యక్షుడు రఘువర్ధన్ రెడ్డి
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నేటికీ అమలు చేయడంలేదని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) జిల్లా అధ్యక్షుడు ఊడెం రఘువర్ధన్‌రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కార్యవర్గ సమావేశం జిల్లా కేంద్రంలో నిర్వహించారు. ఈ సందర్భంగా రఘువర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్‌ను పునరుద్ధరిస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం తగదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన హామీలను గుర్తు చేయడం కోసం సోమవారం ఉద్యోగుల విద్రోహ దినంగా పాటిస్తున్నామన్నారు. మన పాఠశాల – మన ఆత్మగౌరవం, ఆత్మగౌరవ సభ లను చేపడుతున్నామని చెప్పారు. అదే రోజు మధ్యాహ్నం హైదరాబాద్ లో జరిగే సీపీఎస్ ఉద్యోగుల ఆత్మగౌరవ సభను జయప్రదం చేయాలన్నారు. అంతకు ముందు వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు.