
పత్తికి అతివృష్టి దెబ్బ
గజ్వేల్: పత్తికి అతివృష్టి దెబ్బ తగిలింది. తెల్ల‘బంగారం’గా చెప్పుకునే ఈ పంటను ఎన్నో ఆశలతో సాగు చేస్తే రైతుల ఆశలపై నీళ్లు చల్లినట్లయ్యింది. కొన్ని రోజులుగా తెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా లోతట్టుగా ఉన్న పత్తి చేలల్లో నీరు నిలిచి ఇప్పటికే తీవ్ర నష్టం జరిగింది. జిల్లావ్యాప్తంగా ఈసారి 1.06లక్షల ఎకరాలకుపైగా పత్తి సాగులోకిరాగా ఇప్పటికే 60శాతానికి పంట దెబ్బతిన్నది. జిల్లాలో ఈసారి 5.60లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగులోకి వస్తాయని వ్యవసాయశాఖ అంచనా వేస్తే..ఇప్పటి వరకు 4.87లక్షల ఎకరాలకుపైగా పంటలు సాగులోకి వచ్చాయి. ఇందులో వరి 3.40లక్షలు, మొక్కజొన్న 27,820, కంది 6,594 ఎకరాల్లో సాగులోకి రాగా పత్తి 1.06లక్షల ఎకరాలపైగా సాగులోకి వచ్చింది. మిగిలిన విస్తీర్ణంలో ఇతర పంటలు సాగులోకి వచ్చాయి. తెల్ల‘బంగారం’గా చెప్పుకునే పత్తితో జిల్లాకు విడదీయరాని అనుబంధం ఉంది. వరి తర్వాత పత్తి పంటే ఇక్కడి రైతులకు ప్రధాన ఆధారం. నిజానికి ఈసారి 1.11లక్షల ఎకరాల్లో ఈ పంట సాగులోకి వస్తుందని వ్యవసాయశాఖ అంచనా వేస్తే.. 5వేల ఎకరాలు తగ్గింది. సీజన్ ఆరంభంలో అనావృష్టితో నష్టపోయిన రైతులు.. తాజాగా అతివృష్టితో పంట దెబ్బతిని పీకల్లోతూ కష్టాలు కూరుకుపోయారు.
పత్తి రికవరీకి అవకాశం
రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పత్తి పంట రివకరీ అయ్యే అవకాశం ఉన్నది. రైతులు ముఖ్యంగా తమ పత్తి చేలల్లో నీరు నిలిచి ఉండకుండా బయటకు పంపించే ఏర్పాట్లు చేసుకోవాలి. తెగుళ్ల సోకితే క్షేత్రస్థాయిలో వ్యవసాయశాఖ అధికారులను సంప్రదించి వారి సలహాలు, సూచనలు పాటించాలి.
: స్వరూపరాణి, జిల్లా వ్యవసాయాధికారి
వేలాది ఎకరాల్లో అపార నష్టం
తెగుళ్ల దాడి, పంట ఎదుగుదలపైతీవ్ర ప్రభావం
జిల్లాలో 1.06లక్షలఎకరాలకుపైగా సాగు
పంట రికవరీకి యూరియా ప్రభావం
ఆందోళనలో రైతాంగం
అతివృష్టితో పత్తికి భారీ నష్టం
కొన్ని రోజులుగా తెరిపిలేకుండా కురిసిన వర్షాలు మిగతా పంటలతో పోలీస్తే పత్తికి తీవ్ర నష్టాన్ని కలిగించాయి. కాలం కలిసొస్తే మంచి దిగుబడులు రావడంతోపాటు ధర కూడా ఆశించిన విధంగా పలకవచ్చనే ఆశతో రైతులు పత్తిని సాగు చేస్తుండగా..అతివృష్టి వారి ఆశలపై నీళ్లు చల్లింది. ఇదేవిధంగా వర్షాలు కొనసాగితే చెలక, నల్ల రేగడి భూముల్లో పత్తికి నష్టం తీవ్రత పెరగనున్నది. గడ్డి విపరీతంగా పెరిగిపోవడం, మొక్కలకు వేరుకుళ్లు, ఇతర తెగుళ్లు వ్యాపించే అవకాశమున్నది.
పంటను రికవరీ చేసుకునే అవకాశం ఏదీ..?
ఇప్పటికే భారీ వర్షాల కారణంగా తీవ్ర పంట నష్టానికి గురై రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉండగా.. యూరియా కొరత శాపంగా మారింది. అతివృష్టి వల్ల దెబ్బతిన్న పత్తిని కొంత మేరకై నా రికవరీ చేసుకోవడానికి యూరియాను వేస్తుంటారు. ప్రస్తుతం యూరియా దొరక్క రైతులు పంటపై ఆశలు చాలించుకున్నారు. కొందరు ఈ పంటను తొలగించడానికి సిద్ధమైన దయనీయ పరిస్థితి నెలకొన్నది. జిల్లావ్యాప్తంగా సాగులోకి వచ్చిన 1.06లక్షల ఎకరాల్లో భారీ వర్షాల వల్ల 60శాతానికిపైగా పంట ఇప్పటికే దెబ్బతిన్నది. వరద నీరు తొలగించిన చోట కొంత రికవరీ అవుతున్నది. ఈ సమయంలో యూరియా వేసి పంటను కాపాడుకోవాల్సి ఉండగా...యూరియా దొరికే పరిస్థితి లేకపోవడం ఆందోళన కలిగిస్తున్నది.

పత్తికి అతివృష్టి దెబ్బ