
రోడ్డెక్కిన రైతులు
అక్కన్నపేటలో అధికారుల నిర్బంధం
దుబ్బాక మండలం చీకోడులో ధర్నా చేస్తున్న రైతులు
సిద్దిపేటజోన్/అక్కన్నపేట(హుస్నాబాద్)/హుస్నాబాద్‌రూరల్/హుస్నాబాద్/తొగుట(దుబ్బాక)/ దుబ్బాకరూరల్: జిల్లాలో యూరియా కోసం రైతులు శనివారం రోడ్డెక్కారు. సిద్దిపేట ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డు, అలాగే.. అక్కన్నపేట మండల కేంద్రంలో నిరసన తెలిపారు. రోడ్డుపై బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఒకదశలో అధికారులను కలిసేందుకు విఫలయత్నం కావడంతో ఆందోళనకు దిగారు. దీంతో సిద్దిపేట, కరీంనగర్ మార్గంలో వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ స్తంభించింది. అక్కన్నపేట ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వందలాది రైతులు యూరియా కోసం రోడ్డెక్కి నిరసన తెలిపారు. స్థానిక రైతు వేదికలో వ్యవసాయ అధికారులను నిర్భందించారు. అక్కడే చుట్టుముట్టి అలసిపోయి కొందరు నిద్రించారు. వెంటనే యూరియా సరఫరా చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
అలాగే.. రెండు లారీల యూరియా వస్తుందన్న సమాచారంతో వివిధ గ్రామాల రైతులు, మహిళలు ఉదయం 4 గంటలకు తొగుటకు చేరుకున్నారు. ఆగ్రోస్ సేవా కేంద్రం, పీఏసీఎస్ కార్యాలయం ఎదుట లైన్‌లో నిలబడ్డారు. ఉదయం నుంచి నిలబడిన రైతులు ఓపిక నశించడంతో చెప్పులు, బీరు బాటిళ్లను వరుసలో ఉంచారు. లింగంపేటకు చెందిన నాల్గవ తరగతి విద్యార్ది రేవంత్ స్కూల్‌కు వెళ్లకుండా యూరియా కోసం తండ్రితో పాటు లైన్‌లో నిలుచున్నాడు. 9 గంటల వరకు వేచిచూసిన రైతులకు యూరియా సాయంత్రం వస్తుందనితేవో మోహన్ చెప్పడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గజ్వేల్–సిద్దిపేట రోడ్డుపై భైఠాయించారు.
దుబ్బాక మండలం చీకోడ్ గ్రామంలో రైతులు యూరియా కోసం రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు సర్దిచెప్పడంతో ఆందోళన విరమించారు.
హుస్నాబాద్: పంట కాలం ముగిసిన తర్వాత ఎరువులు ఇస్తారా అంటూ రైతులు మండిపడ్డారు. శనివారం హుస్నాబాద్ పట్టణంలోని రైతు మిత్ర, గ్రోమోరు ఎరువుల దుకాణాల వద్ద ధర్నా నిర్వహించారు. వరి నాట్లు వేసి దాదాపు నెల రోజుల నుంచి యూరియా కోసం పడిగాపులు కాస్తున్నామని వాపోయారు.

రోడ్డెక్కిన రైతులు

రోడ్డెక్కిన రైతులు