
కక్షిదారులకు సత్వర న్యాయం అందాలి
సిద్దిపేటకమాన్: కోర్టు ద్వారా కక్షిదారులకు సత్వరంగా న్యాయాన్ని అందించాలని హైకోర్టు న్యాయమూర్తులు పుల్లా కార్తీక్, బి.విజయ్‌సేన్‌రెడ్డి, ఎన్.వి, శ్రావణ్‌కుమార్ అన్నారు. సిద్దిపేట జిల్లా కోర్టులో నూతనంగా నిర్మించిన రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్డు కమ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ భవనాన్ని, మూడు, నాల్గవ అంతస్తులో నూతనంగా నిర్మించిన కోర్టు భవనాలను జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయిరమాదేవితో కలసి న్యాయమూర్తులు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి పుల్లా కార్తీక్ మాట్లాడుతూ.. బార్ అసోసియేషన్, కోర్టు బెంచ్ ఆరోగ్యవంతమైన సంబంధాలతో ముందుకు సాగాలని, అప్పుడే న్యాయం అందుతుందని చెప్పారు. జస్టిస్ విజయ్‌సేన్‌రెడ్డి మాట్లాడుతూ.. న్యాయం కోసం కోర్టులకు వచ్చే ప్రజలకు అసంతృప్తిని కల్పించకూడదన్నారు. ఇరువర్గాల కక్షిదారులకు న్యాయం చేకూరేలా చూడాలని తెలిపారు. జస్టిస్ శ్రావణ్‌కుమార్ మాట్లాడుతూ..జిల్లాలో 450మంది న్యాయవాదులు ఉంటే 20మంది మహిళ న్యాయవాదులు ఉన్నారన్నారు. తాను బెజ్జంకి మండలం గుగ్గిళ్ల ప్రాంతానికి చెందిన ఈ ప్రాంతం వాడినన్నారు. రాజ్యాంగం చదివితే తమ హక్కులు, విధులు తెలుసుకోవడంతో పాటు, ప్రజాస్వామ్యంలో చురుకై న పాత్ర పోషించగలరని అన్నారు. అనంతరం ఉత్తమ సేవలందించిన పలువురు కోర్టు సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశారు. రెండు బ్యాంకుల సహకారంతో బాలసదనంకు రూ.50వేల చెక్‌తో పాటు వాటర్ ప్యూరిపైర్‌ను అందజేశారు. హైకోర్టు న్యాయమూర్తులను జిల్లా న్యాయమూర్తి సాయిరమాదేవి, కలెక్టర్ కె.హైమావతి, సీపీ అనురాధ శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు జయప్రసాద్, మిలింద్‌కాంబ్లి, సంతోష్, సాధన, రేవతి, స్వాతి, జితేందర్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సిహెచ్ జనార్థన్‌రెడ్డి, జనరల్ సెక్రటరీ రమేష్, తదితరులు పాల్గొన్నారు.
హైకోర్టు న్యాయమూర్తులుకార్తీక్, విజయ్‌సేన్‌రెడ్డి శ్రావణ్‌కుమార్
సిద్దిపేటలో నూతన కోర్టు భవనాలనుప్రారంభించిన న్యాయమూర్తులు

కక్షిదారులకు సత్వర న్యాయం అందాలి