
సృజనాత్మక బోధనతోనే గుణాత్మక విద్య
జగదేవ్‌పూర్(గజ్వేల్): ప్రాథమిక పాఠశాల స్థాయిలో సృజనాత్మకతో బోధించడం వల్ల విద్యార్థులకు నేర్చుకోవాలన్న ఆసక్తిని రేకెత్తించేలా ఉండాలని జిల్లా విద్యాధికారి శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రమైన జగదేవ్‌పూర్‌లో శనివారం ప్రాథమిక స్థాయి టీఎల్‌ఎం (బోధనాభ్యసన సా ఛగ్రి) మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యారంగంలో ఉత్తమ ఫలితాల సాధనలో ప్రాథమిక ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమన్నారు. విద్యార్థులు ఉత్సాహంగా నేర్చుకునేలా బోధనా విధానం, తరగతి గది ఉండాలనే లక్ష్యంతో ఎఫ్‌ఎల్‌ఎన్ పద్ధతిని అమలు చేస్తున్నట్లు తెలిపారు. తరగతి గదిలోకి రాగానే చదవడం, రాయడం కాకుండా విద్యార్థులకు బోధనాభ్యాసన వైపు ఆసక్తిని రేకెత్తించేలా బోధన విధానాన్ని ఎంచుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు. కాగా ఆయా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు రూపొందించిన పలు ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. వీటిలో ఉత్తమ ప్రదర్శనలను ఎంపిక చేసి ఉపాధ్యాయులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో మాధవరెడ్డి, తహశీల్దార్ నిర్మల, ఎంపీడీవో రాంరెడ్డి, కాంప్లెక్స్ హెచ్‌ఎం సైదులు, ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా విద్యాధికారి శ్రీనివాస్‌రెడ్డి
జగదేవ్‌పూర్‌లో టీఎల్‌ఎం మేళా