
ఆ ప్రభుత్వాస్పత్రిలో ఏం జరుగుతోంది?
గజ్వేల్: పట్టణంలోని మాతాశిశు సంరక్షణ ఆస్పత్రిలో గతంతో పోలిస్తే డెలివరీలు తగ్గడానికి కారణాలేమిటీ?, అసలు ఏం జరుగుతోంది? అనే అంశాలపై రాష్ట్ర వైద్య విధాన పరిషత్ ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ప్రజ్ఞాపూర్‌కు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత వెంకట్రామ్‌రెడ్డి, గజ్వేల్ ఆత్మ కమిటీ చైర్మన్ మల్లారెడ్డి, టీపీసీసీ కార్యదర్శి నాయిని యాదగిరితోపాటు ఆస్పత్రికి చెందిన పలువురు సిబ్బంది సైతం ఆస్పత్రి ఇన్‌చార్జి సూపరింటెండెంట్ అన్నపూర్ణపై కొన్ని రోజుల క్రితం ఆరోగ్యశాఖ మంత్రి దామోదరతోపాటు వైద్య విధాన పరిషత్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఆసుపత్రికి సంబంధించిన పలు అంశాలు వెలుగులోకి వస్తున్నట్లు తెలిసింది. 2024లో నెలకు 360కిపైగా డెలివరీలు జరిగితే 2025జనవరి నుంచి ఇప్పటివరకు కేవలం నెలకు కేవలం 304డెలివరీలు మాత్రమే జరుగుతున్నాయని కాంగ్రెస్ నేతలు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. గతంతో పోలిస్తే గైనకాలజీ విభాగంలో వసతులు మెరుగుపడి, వైద్యాధికారులు, సిబ్బంది సంఖ్య పెరిగినా డెలివరీలు తగ్గాయని, ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలతో కుమ్మక్కు కావడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే ఆస్పత్రిలో నెలకొన్న వాస్తవ పరిస్థితిపై ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తున్నది. ఈ అంశంపై సమగ్ర విచారణ జరుగనున్నదని సమాచారం.
ఆరా తీస్తున్న వైద్యారోగ్యశాఖఉన్నతాధికారులు
సూపరింటెండెంట్‌పై ఫిర్యాదుతోపలు అంశాలు వెలుగులోకి