
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్
చిన్నకోడూరు (సిద్దిపేట): సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్ సూచించారు. గురువారం చిన్నకోడూరు పీహెచ్‌సీని సందర్శించారు. ఆస్పత్రిలో అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. కాలం చెల్లిన మందులు వాడకూడదని సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే వైద్యం చేయించుకోవాలని రోగులకు సూచించారు. అనంతరం చిన్నకోడూరు, రామంచ గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నిర్మాణం ప్రారంభించని ఇళ్లను త్వరగా మొదలు పెట్టి పూర్తి చేయించాలని అధికారులను ఆదేశించారు. ఆమె వెంట ఎంపీడీఓ జనార్దన్, ఎంపీఓ సోమిరెడ్డి, అధికారులు పాల్గొన్నారు.
ఇష్టంగా చదవండి
ఉన్నతంగా ఎదగండి
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు
రాంగోపాల్‌రెడ్డి
కోహెడ(హుస్నాబాద్): విద్యార్థులు ఇష్టంగా చదివి ఉన్నతంగా ఎదగాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కోమటిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి సూచించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ సౌజన్యంతో ప్రధాని మోదీ కానుకగా పాఠశాల విద్యార్థులకు 61 సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రానున్న టెన్త్ పరీక్షల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు సైతం బహుమతులు అందించనున్నట్లు చెప్పారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను చేరుకొని తల్లిదండ్రుల కోరికలను నెరవేర్చాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ వెంకటేశం, మండలాధ్యక్షుడు జాలిగం రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
అర్హులందరికీ
సంక్షేమ ఫలాలు
డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి
గజ్వేల్: అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి అన్నారు. గురువారం గజ్వేల్‌లోని తన నివాసంలో రూ.15.73లక్షల విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కృషి చేస్తున్నారని కొనియాడారు. రాష్ట్ర ఖాజానాపై తీవ్రమైన భారం పడుతున్న పేదల అభ్యున్నతే లక్ష్యంగా సాహాసోపేత నిర్ణయాలతో ముందుకుసాగుతున్నారని చెప్పారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్ధార్‌ఖాన్, కాంగ్రెస్ పట్టణ నాయకులు మొనగారి రాజు, రాములుగౌడ్ తదితరులు పాల్గొన్నారు.