
చెట్టుకు బొట్టుపెట్టి.. రాఖీ కట్టి
ప్రకృతి ప్రేమికులు వినూత్న రీతిలో రక్షాబంధన్ జరుపుకొన్నారు. పర్యావరణ పరిరక్షణకు వృక్షాలే కీలకమంటూ.. వృక్షాబంధన్ పేరుతో వేడుకలు చేశారు. చేర్యాల మండలం రాంపూర్, అక్బర్‌పేట–భూంపల్లి మండలం కూడవెల్లి ప్రాథమిక పాఠశాలల విద్యార్థులు ప్రాణవాయువునిచ్చే చెట్లకు బొట్టు పెట్టి రాఖీ కట్టారు. ‘మనం చెట్లకు రక్షణ–చెట్లు మనకు రక్షణ‘ అంటూ గులాబీ పూలతో అల్లిన రాఖీలను చెట్లకు కట్టి మిఠాయిలు పంచుకున్నారు. వృక్షో రక్షతి రక్షితః అంటూ అందరం మొక్కలు నాటి పరిరక్షిస్తామంటూ ప్రతిజ్ఙ చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు. – చేర్యాల(సిద్దిపేట)/మిరుదొడ్డి(దుబ్బాక)