
చేనేత ర్యాలీని జెండా ఊపి ప్రారంభిస్తున్న కలెక్టర్ హైమావతి
ఉత్పత్తులకు బ్రాండ్ సిద్దిపేటగా మారుద్దాం
ప్రతీ సోమవారం చేనేత దుస్తులనే ధరిద్దాం
కలెక్టర్ హైమావతి
ఘనంగా జాతీయ చేనేతదినోత్సవ వేడుకలు
సిద్దిపేటరూరల్: గొల్లభామ ఉత్పత్తులకు బ్రాండ్ సిద్దిపేటగా తీర్చిదిద్దేందుకు కృషి చేద్దామని కలెక్టర్ హైమావతి నేత కార్మికులకు పిలుపునిచ్చారు. గురువారం కలెక్టరేట్‌లో చేనేత, జౌళిశాఖ ఆధ్వర్యంలో చేనేత దినోత్సవ వేడుకలు నిర్వహించారు. మొదటగా కలెక్టరేట్ ప్రధాన ద్వారం నుంచి మీటింగ్ హా ల్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రతిజ్ఞ చేశారు. వేడుకలకు కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మన నాగరికతకు ఆనవాళ్లు మనం వేసుకునే వస్త్రాలేనని అన్నారు. నేతన్నల సంక్షేమం, అభివృద్ధికి అందరూ కలిసి సొసైటీలను ఏర్పాటు చేసుకోవాలన్నారు.
ప్రస్తుత మార్కెట్ ట్రెండ్ కు అనుగుణంగా ఉత్పత్తులు రావాలని సూచించారు. ఇందుకోసం ప్రభుత్వం తరపున పూర్తి సహకారాన్ని అందిస్తామన్నారు. ప్రతి సోమవారం తాను కాటన్ వస్త్రాలను ధరిస్తానని, జిల్లా యంత్రాంగంతోపాటు అందరూ కాటన్ దుస్తులు ధరించాలన్నారు. చేనేత వస్త్రాల తయారీలో మహిళలు సంఘంగా ఏర్పడితే వారందరికీ స్థలం ఇవ్వడంతో పాటు ఆర్థిక తోడ్పాటు కోసం బ్యాంకర్ల ద్వారా సహకారం అందిస్తామన్నారు. అనంతరం అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ మాట్లాడుతూ సిద్దిపేట చేనేతకు ప్రాధాన్యం ఇవ్వాడానికి కృషి చేస్తానని తెలిపారు.
సిద్దిపేట గొల్లభామకు ప్రాచుర్యం కల్పించడంలో తన వంతు కృషి చేస్తానన్నారు. ఈ సందర్భంగా పలువురి నేత కార్మికులను సన్మానించారు. అనంతరం పలు పోటీల్లో ప్రతిభ చాటిన విద్యార్థినులను సత్కరించారు. నేతన్న పొదుపు పథకం కింద 550 మంది లబ్ధిదారులకు రూ.15లక్షల 84 వేల చెక్కును అందజేశారు. కార్యక్రమంలో చేనేత, జౌళి శాఖ అధికారి సాగర్, జిల్లా పంచాయతీ అధికారి దేవకీదేవి, ఉద్యాన శాఖ అధికారి, జెడ్పీ సీఈఓ రమేష్ తదితరులు పాల్గొన్నారు.