
అపార్‌కు ఆధార్ అవస్థలు
సాక్షి, సిద్దిపేట: ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు అపార్ (ఆటోమేటెడ్ పర్మినెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ) నమోదు తప్పనిసరి చేశారు. అయితే ఆధార్ కార్డు నంబర్‌తో పాఠశాలల్లో అపార్‌ను నమోదు చేస్తున్నారు. ఆధార్ లేని విద్యార్థులకు అపార్ నమోదు చేయడం లేదు. వన్ నేషన్ వన్ స్టూడెంట్ పేరిట అపార్ అందజేస్తోంది. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న వివరాలను యూడైస్‌లో నమోదు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 1,316 పాఠశాలలుండగా అందులో 1,68,381 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఇప్పటివరకు 1,35లక్షల మంది అపార్ నమోదు చేసుకున్నారు.
వివరాలు ఒకేలా ఉంటేనే నమోదు
జిల్లావ్యాప్తంగా 1,35,848 మంది విద్యార్థుల సంబంధించిన వివరాలు ఆధార్‌లోనూ పాఠశాలలోనూ ఒకే రకంగా ఉన్నాయి. 26,367 మంది విద్యార్థుల వివరాలు మాత్రం సరిపోలడంలేదు. దీంతో అపార్‌లో నమోదు కావడం లేదు. ఆధార్ కార్డులను అప్‌డేట్ చేస్తే నమోదు కానున్నాయి. పేరు పూర్తిగా లేకపోవడం, పుట్టిన తేదీల్లో మార్పులు ఉండటంతో అపార్ నమోదులో సమస్యలు వస్తున్నట్లు ఉపాధ్యాయులు చెబుతున్నారు. జిల్లాలో 26,367 విద్యార్థుల ఆధార్ కార్డులు అప్‌డేట్ చేయాల్సి ఉండగా ఏకంగా 6,166 మంది పిల్లలకు ఆధార్ కార్డులే లేవని విద్యాశాఖ గుర్తించింది. దీంతో వారి కోసం 16 చోట్ల ప్రత్యేక ఆధార్ కేంద్రాలను పాఠశాలలో ఏర్పాటు చేసి నమోదు చేయిస్తున్నారు.
విద్యార్థి వివరాలు నిక్షిప్తం
అపార్ కార్డు ద్వారా విద్యార్థులకు ఎన్నో ప్రయోజనాలున్నాయి. విద్యార్థి పేరు, పుట్టిన తేదీ, లింగం, ఫొటో, క్యూఆర్ కోడ్, 12 అంకెలతో కూడిన గుర్తింపు సంఖ్య ఉంటుంది. ఈ కార్డుపై ఉన్న నంబర్ కేంద్ర రాష్ట్ర విద్యాశాఖల వెబ్‌సైట్‌లో నమోదు చేస్తే ఎల్‌కేజీ నుంచి పీజీ వరకూ ఎక్కడ చదివారన్న వివరాలు ఇట్టే ప్రత్యక్షమవుతాయి. అపార్ గుర్తింపుతో డీజీలాకర్‌కు అనుసంధానం అవుతారు. దీంతో అన్ని ధ్రువీకరణ పత్రాలను విద్యార్థి సురక్షితంగా భద్రపరుచుకోవచ్చు. పాఠశాల మారినా ఇబ్బంది ఉండదు. విద్యార్థులు పొందుతున్న ఉపకార వేతనాలు, ఇతర ప్రయోజనాలు, వివిధ విద్యాసంస్థల్లో చేరికలు, మార్పులు, ఉద్యోగాల భర్తీ సమయంలో, ఇతర అంశాల్లో అపార్ కార్డు ఆధారంగా సమాచారాన్ని తీసుకుంటారు.
ఆధార్ కార్డు లేని6 వేలమంది విద్యార్థులు
26వేలమంది పిల్లలకుఅవసరమైన అప్‌డేట్
జిల్లాలో కొనసాగుతున్న అపార్ రిజిస్ట్రేషన్
ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నాం
విద్యార్థులందరికీ ఆధార్ తప్పనిసరిగా ఉండాలి. ఆధార్ ఆధారంగానే అపార్‌లో నమోదుకు వీలుంటుంది. జిల్లాలో ఆధార్ కార్డు లేకుండా 6వేల మంది విద్యార్థులున్నట్లు గుర్తించాం. పాఠశాలల్లో ప్రత్యేకంగా ఆధార్ కేంద్రాలను ఏర్పాటు చేసి స్పెషల్ డ్రైవ్‌ను చేపట్టాం. మరో 15 రోజుల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.
– శ్రీనివాస్ రెడ్డి, డీఈవో, సిద్దిపేట

అపార్‌కు ఆధార్ అవస్థలు