
త్వరలో ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ ప్రారంభం
● సీఎం చేతుల మీదుగా... ● అధికారులతో సమీక్షలో కలెక్టర్
నంగునూరు(సిద్దిపేట)/సిద్దిపేటకమాన్/హుస్నాబాద్: నంగునూరు మండలం నర్మేటలో రూ.300 కోట్లతో అత్యాధునిక టెక్నాలజీతో నిర్మించిన ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీని త్వరలోనే ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు కలెక్టర్ హైమావతి తెలిపారు. ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీని మంగళవారం కలెక్టర్ సందర్శించి నిర్మాణం పనులను పరిశీలించారు. ఉద్యానవనశాఖ, ఆయిల్‌ఫెడ్, విద్యుత్‌శాఖ, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్‌శాఖల అఽధికారులతో ఫ్యాక్టరీ పనులపై సమీక్ష నిర్వహించారు. అనంతరం సిద్దిపేటలోని బస్తీ దవాఖానను తనిఖీ చేశారు. ఉదయం 9.45 గంటలైనా డ్యూటీ డాక్టర్ గైర్హాజరుపై కఠిన చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్‌ఓను ఆదేశించారు. కాలి గాయంతో ఆస్పత్రికి వచ్చిన వ్యక్తితో మాట్లాడారు. డాక్టర్ అందుబాటులో ఉంటారా? వైద్యం ఏలా చేస్తున్నారు? వంటి విషయాలు కలెక్టర్ ఆరా తీశారు. తర్వాత హుస్నాబాద్ పట్టణ శివారులోని కిషన్ నగర్‌లో శాతవాహన ఇంజనీరింగ్ కళాశాలను సందర్శించారు. ఐఓసీ రోడ్ నుంచి కళాశాల ప్రాంగణం వరకు సీసీ రోడ్ ఏర్పాటుకు అంచనాలు ప్రతిపాదించాలని పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ శాఖ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. తాత్కాలిక హెలీప్యాడ్‌ను సిద్ధం చేయాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందుతున్న సేవల్ని ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్, జిల్లా ఉద్యానవనాధికారి సువర్ణ, ఆయిల్‌ఫెడ్ మేనేజర్ సుధాకర్‌రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి స్వరూపరాణి పాల్గొన్నారు.