
క్షేత్రస్థాయిలో ప్రజల్ని కలుద్దాం
సిద్దిపేటజోన్: కాళేశ్వరం ప్రాజెక్టు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మాజీమంత్రి హరీశ్‌రావు చెప్పిన అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజాచైతన్యం ద్వారా అధికార కాంగ్రెస్‌కు స్థానిక ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని ఎమ్మెల్సీ యాదవరెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్‌లో ఎమ్మెల్యే హరీశ్‌రావు పవర్ ప్రజెంటేషన్‌ను మంగళవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో భారీ స్క్రీన్ ద్వారా జిల్లాలోని పార్టీ శ్రేణులు వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...పవర్ ప్రజెంటేషన్ పాలకులకు జ్ఞానోదయం కలిగేలా, ప్రజల్లో ఒక అవగాహన వచ్చేలా ఉందన్నారు. కేసీఆర్, హరీశ్‌రావుల నిరంతరం కృషి వల్ల గోదావరి జలాలను కాళేశ్వరం ద్వారా తరలించినట్లు వివరించారు. రైతులకు సాగునీరు అంది దేశంలో అత్యధిక సాగు వచ్చిందన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి వచ్చిన మంచిపేరు చూసి ఓర్వలేక కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని ఆరోపించారు. కేసీఆర్, హరీశ్‌రావుపై దుష్ప్రచారం చేస్తూ రాజకీయ పబ్బం కోసం తాపత్రయపడుతుందన్నారు. స్థానిక ఎన్నికల్లో అన్ని స్థానాలను బీఆర్‌ఎస్ కై వసం చేసుకోవాలని పిలుపునిచ్చారు. హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని గౌరవెల్లి ప్రాజెక్టును బీఆర్‌ఎస్ హయాంలో 90% పూర్తి చేస్తే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పటివరకు ఒక్క అడుగు ముందుకు వేయలేదని ఆరోపించారు. అంతకుముందు మాజీ ఎమ్మెల్యే సతీశ్‌కుమార్, మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్, మాజీ కార్పొరేషన్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ...కాళేశ్వరం ప్రాజెక్టు, కేసీఆర్ కుటుంబం మీద కాంగ్రెస్ సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తుందన్నారు. పవర్ ప్రజెంటేషన్ ద్వారా కాళేశ్వరం విలువ ప్రతి ఒక్కరికి తెలిసిందన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో రేషన్ కార్డులు పంపిణీ చేసినట్లు వారు తెలిపారు. సిద్దిపేట జిల్లావ్యాప్తంగా అన్ని స్థానిక సంస్థలను కై వసం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి శర్మ, మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్స్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు వేణుగోపాల్ రెడ్డి, సాయిరాం, శ్రీనివాస్, పట్టణ పార్టీ అధ్యక్షుడు సంపత్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు, మాజీ సర్పంచ్లు,కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ యాదవరెడ్డి

క్షేత్రస్థాయిలో ప్రజల్ని కలుద్దాం