
అర్జీలను సత్వరం పరిష్కరించాలి
సిద్దిపేటరూరల్: ప్రజావాణిలో వచ్చిన అర్జీలను సత్వరం పరిష్కరించాలని కలెక్టర్ కె.హైమావతి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా అదనపు కలెక్టర్లు గరీమా అగర్వాల్, అబ్దుల్ హమీద్‌లతో కలిసి కలెక్టర్ కె.హైమావతి అర్జీలను స్వీకరించారు. అంతకుముందు ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... ప్రజలు నమ్మకంతో ప్రజావాణికి వస్తున్న క్రమంలో వారికి న్యాయం కల్పించడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. వసతి గృహాల్లో ఉండే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈనెల 11న జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంలో 1 నుంచి 19 ఏళ్లలోపు పిల్లలందరికీ ఆల్బెండజోల్ మాత్రలను వేయించాలని ఆదేశించారు.వివిధ పరిశ్రమల స్థాపనకు టీజీఐపాస్‌లో దరఖాస్తు చేసుకున్న వారందరికీ విభాగాల వారీగా పరిశీలన చేసి అనుమతులి వ్వాలని అధికారులకు సూచించారు. కాగా, ప్రజావాణిలో 157 దరఖాస్తులు వచ్చాయి.
కుక్ సతీశ్‌ను బదిలీ చేయవద్దు
మేము చిన్నకోడూరులోని బీసీ వెల్ఫేర్ హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్న విద్యార్థులం. హాస్టల్లో కుక్‌గా పనిచేస్తున్న సతీశ్‌ను బదిలీ చేశారు. తమకు చాలా రోజులుగా వంటలు వండుతూ సాయంత్రం సమయంలో ట్యూషన్ నిర్వహిస్తూ ఎంతో సహాయకారిగా ఉండేవాడు. ఎలాగైనా కలెక్టర్ స్పందించి సతీశ్‌ను బదిలీ చేయకుండా మళ్లీ తమ హాస్టల్‌కు వచ్చేలా చూడాలన్నారు. అంతకుముందు విద్యార్థులు కొద్దిసేపు కలెక్టరేట్ ముందు నిరసన వ్యక్తం చేశారు.
157 అర్జీలు స్వీకరించిన కలెక్టర్ హైమావతి