ఆదాయ మార్గాల వైపు నజర్‌ | - | Sakshi
Sakshi News home page

ఆదాయ మార్గాల వైపు నజర్‌

Aug 4 2025 5:10 AM | Updated on Aug 4 2025 5:10 AM

ఆదాయ

ఆదాయ మార్గాల వైపు నజర్‌

అనుమతులు గృహాలకు... నడుస్తున్నది కమర్షియల్‌
● గ్రౌండ్‌ ఫ్లోర్‌కే పన్ను చెల్లింపులు.. పైఅంతస్తులకు ఎగవేత ● అక్రమ నిర్మాణాలకే పెనాల్టీ అంటున్న అధికారులు

హుస్నాబాద్‌: మున్సిపల్‌ అధికారులు ఆదాయ మార్గాలపై దృష్టి సారించారు. అక్రమ ఇళ్ల నిర్మాణాలను గుర్తించే పనిలో పడ్డారు. హుస్నాబాద్‌ పట్టణంలో ఇళ్లు 6,039, కమర్షియల్‌ 579, మిక్స్‌డ్‌ 684 మొత్తం కలిపి 7,302 ఉన్నాయి. గత కొంత కాలంగా పట్టణంలో అక్రమ నిర్మాణాలు, గృహ నిర్మాణం పేరిట వాణిజ్య సముదాయాలు నడుపుతూ మున్సిపల్‌ ఆదాయానికి గండి కొడుతున్నారనే ఉద్దేశంతో అధికారులు అక్రమ నిర్మాణాలపై కొరడా ఝళిపిస్తున్నారు. గతంలోనే పట్టణాన్ని నాలుగు డివిజన్లుగా విభజించి ఇంటి పన్నులు విధించారు. ప్రస్తుతం పట్టణంలో ప్రతి ఇంటిని భువన్‌ సర్వే చేసి ఇంటి విస్తీర్ణాన్ని కొలతలు వేసి ప్రత్యేక యాప్‌లో నిక్షిప్తం చేస్తున్నారు. పాత ఇంటి పన్నుల ఆధారంగానే విస్తీర్ణాన్ని బట్టి ఇంటి పన్నులు విధిస్తున్నారు. ప్రస్తుత మున్సిపల్‌ ఆదాయం ఏరియల్స్‌తో కలుపుకొని రూ.1.70 కోట్లు కాగా, దాన్ని మరింత పెంచుకునే మార్గాలను మున్సిపల్‌ అధికారులు అన్వేషిస్తున్నారు. ప్రతీఏటా రివిజన్‌ నిర్వహించాల్సి ఉంటుంది. పదేళ్లుగా ఆ పని చేయలేదు. ప్రస్తుతం ఇంటి రివిజన్‌ చేస్తుండటంతో ఇంటి పన్నులు పదింతలు పెరుగుతుండటంతో ప్రజలు గగ్గోలు పెడుతున్నారు.

గృహ నిర్మాణం పేరిట వాణిజ్యం

పట్టణంలోని మెయిన్‌రోడ్డు, అక్కన్నపేట రోడ్‌, నాగారం రోడ్‌లో కమర్షియల్‌ దుకాణాలు అధికంగా ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో చాలావరకు అక్రమ నిర్మాణాలు చేశారని అధికారుల నిర్ధారించుకున్నారు. ఇంటి (గృహ) నిర్మాణం కోసం అనుమతి తీసుకుని అందులో వాణిజ్య వ్యాపారాలు చేస్తున్నారు. దీంతో మున్సిపల్‌కు గృహ నిర్మాణ పన్ను మాత్రమే చెల్లిస్తున్నారు. అలాగే గ్రౌండ్‌ ఫ్లోర్‌కు గృహ నిర్మాణం అనుమతి తీసుకుని గ్రౌండ్‌ ఫ్లోర్‌తోపాటు పైన మరో రెండు అంతస్తులు వేసి వాణిజ్య పరమైన వ్యాపారాలు చేస్తున్నారు. గ్రౌండ్‌ ఫ్లోర్‌కు మాత్రమే ఇంటి పన్ను చెల్లిస్తూ, పైన అక్రమంగా నిర్మించిన ఫ్లోర్లకు పన్నులు చెల్లించకుండా ఎగ్గోడుతున్నారని అధికారులు చెబుతున్నారు. దీంతో రూ.లక్షల పన్నులు మున్సిపల్‌కు చెల్లించకుండా భారీగా గండికొడుతున్నారని అధికారులు నిర్ధారణకు వచ్చారు. కొన్నేళ్లుగా అనుమతులు సరిగా తీసుకోకుండా పన్నులు చెల్లించని వ్యాపారులపై జరిమానాలు వేస్తూ ఆదాయాన్ని పెంచుకునే దిశగా అధికారులు అడుగులు వేస్తున్నారు. ఇప్పటి వరకు 827 ఇండ్లకు రివిజన్‌ చేయగా, పన్నుల రూపంలో దాదాపు రూ.35 లక్షల వరకు ఆదాయం వచ్చినట్లు తెలుస్తోంది.

ఇంటి పన్నులు పెంచలేదు

సీడీఎంఏ ఆదేశాల మేరకే రివిజన్‌ నిర్వహిస్తున్నాం. పాత ఇంటి పన్నులే తప్ప కొత్తగా పన్నులు పెంచలేదు. అక్రమ నిర్మాణాలు, ఇంటి పర్పస్‌ అనుమతి తీసుకొని వాణిజ్య వ్యాపారం చేసుకుంటున్న వారికి పెనాల్టీ వేస్తున్నాం. పన్నులు అధికంగా వేశారని అనుకుంటే దరఖాస్తు చేసుకుంటే మళ్లీ రివ్యూ చేస్తాం. –మల్లికార్జున్‌,

మున్సిపల్‌ కమిషనర్‌, హుస్నాబాద్‌

ఆదాయ మార్గాల వైపు నజర్‌1
1/1

ఆదాయ మార్గాల వైపు నజర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement