
క్రీడా సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలి
రాష్ట్ర ఫుట్‌బాల్ అసోసియేషన్ సెక్రటరీ ఫాల్గుణ
సిద్దిపేటజోన్: రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత సిద్దిపేటలో అద్భుతమైన ఫుట్‌బాల్ మైదానం ఉందని రాష్ట్ర ఫుట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి ఫాల్గుణ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ఫుట్‌బాల్ మైదానంలో అష్మిత లీగ్ నాకౌట్ 2025 ఫుట్‌బాల్ టోర్నీ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇక్కడ ఆటకు తగ్గట్టుగా వసతులున్నాయన్నారు. గ్రామీణ ప్రాంతాలకూ చెందిన క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అంతకుముందు మున్సిపల్ చైర్మన్ మంజుల, మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిరాంలు మాట్లాడుతూ..క్రీడాహబ్‌గా సిద్దిపేటను తీర్చిదిద్దడానికి ఎమ్మెల్యే హరీశ్‌రావు చేసిన కృషి విస్మరించలేనిదన్నారు. సిద్దిపేట నుంచి జాతీయ, రాష్ట్ర స్థాయి క్రీడాకారులు వచ్చారని పేర్కొన్నారు. యువత క్రీడల పట్ల ఆసక్తి చూపాలని సూచించారు.
రసవత్తరంగా పోటీలు
అష్మిత ఫుట్‌బాల్ లీగ్ టోర్నీ పోటీలు రసవత్తరంగా సాగాయి. ఖేల్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో నిజామాబాద్ విజేతగా నిలిచింది. పోటీల్లో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొనగా, ఫైనల్ మ్యాచ్ నిజామాబాద్, ఆదిలాబాద్ జట్ల మధ్య జరిగింది. 2–0గోల్స్‌తో నిజామాబాద్ విజయం సాధించింది. రన్నర్‌గా ఆదిలాబాద్, విజేతగా నిజామాబాద్ బహుమతులు అందుకున్నారు. కార్యక్రమంలో పట్టణ బీఆర్‌ఎస్ అధ్యక్షుడు సంపత్‌రెడ్డి, ఫుట్ బాల్ కోచ్ అక్బర్, అసోసియేషన్ అధ్యక్షుడు గణేష్, జాయింట్ సెక్రెటరీ సాజిద్, క్రీడాకారులు పాల్గొన్నారు.