
గజ్వేల్‌లో గందరగోళం
గజ్వేల్ పట్టణంలోని ముట్రాజ్‌పల్లిలోని ఎస్‌ఎమ్ గార్డెన్స్‌లో నిర్వహించిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి హాజరయ్యారు. సభ ప్రారంభమైన కొద్దిసేపటికే డీసీసీ అధ్యక్షుడు, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డిని వ్యతిరేకిస్తూ గజ్వేల్ ఆత్మ కమిటీ చైర్మన్ మల్లారెడ్డి వేదికపైకి వెళ్లగా..అక్కడే ఉన్న డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి వర్గీయులు మల్లారెడ్డిని దిగిపోవాలని నినాదాలిచ్చారు. ఈ సందర్భంగా పోలీసులకు, నర్సారెడ్డి వర్గీయులకు మధ్య తోపులాట జరిగింది. ఇదే క్రమంలో అక్కడే ఉన్న మల్లారెడ్డి కిందకు వచ్చి వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా నర్సారెడ్డి వర్గీయులకు, మల్లారెడ్డితోపాటు అక్కడే ఉన్న నర్సారెడ్డిని వ్యతిరేకిస్తున్న మరో ఇద్దరు అసమ్మతి నేతలు సీనియర్ నాయకుడు నాయిని యాదగిరి, కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు విజయ్‌కుమార్ ఘర్షణకు దిగారు. ఈ క్రమంలో పలువురు నాయకుల చొక్కాలు కూడా చిరిగిపోయాయి. ఇంతలోనే కలెక్టర్ హైమావతి లేచి సభ నిర్వహణకు సహకరించాలని కోరినా ఎవ్వరూ తగ్గలేదు. దీంతో అసహనానికి గురైన మంత్రి వివేక్ జోక్యం చేసుకుని నాయకులకు నచ్చజెప్పడంతో ఉద్రిక్తత సద్దుమణిగింది. ఆ తర్వాత మంత్రి తన ప్రసంగాన్ని పూర్తి చేశారు.