
నకిలీ ఎరువుల కలకలం
● ఇష్టారాజ్యంగా విక్రయాలు ● పట్టించుకోని అధికారులు ● ఆందోళన చెందుతున్న రైతులు
ఈ ఎరువును ఎప్పుడు చూడలేదు
వరినాటులో ఎరువు చల్లేందుకు డీఏపీ బస్తా కోసం ఎరువుల దుకాణానికి వెళితే అది అందుబాటులో లేదని భూమిలాబ్ 19.19.19 అనే ఎరువును అంటగట్టాడు. దానిని పొలంలో చల్లితే పని చేయలేదు. దీనిపై ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియడం లేదు. అధికారులు స్పందించి నకిలీ ఎరువుల బెడదను అరికట్టాలి.
–కిష్టారెడ్డి, రైతు, మర్రిముచ్చాల
కొమురవెల్లి(సిద్దిపేట): మండలంలోని ఎరువుల దుకాణాల్లో నకిలీ ఎరువులు విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. బోరుబావుల కింద కొద్దో గొప్పో సాగు చేస్తున్న రైతులకు ఎరువుల దుకాణదారులు నకిలీ ఎరువులను అంటగడుతున్నారు. మనుగడలో లేని కంపెనీ పేర్లతో ఉన్న ఎరువుల బస్తాలు, దంటు గుళికలు , పురుగుమందులు విక్రయిస్తూ రైతులకు ఆర్థికంగా నష్టం చేకూరుస్తున్నారు. ఇంత జరిగినా వ్యవసాయ అధికారుల పర్యవేక్షణ లేకపోవడం శాపంగా మారింది. గ్రోమోర్ 20.20.0.13, గోదావరి డీఏపీ , 14.35.14, 19.19.19, 17.17.17 ఇట్లాంటి పేరున్న కంపెనీ ఎరువులు అమ్మితే దుకాణదారులకు తక్కువ లాభాలొస్తాయి. కానీ, పంటలకు, రైతులకు మేలు జరుగుతుంది. ఇందుకు భిన్నంగా మండలంలో ఎక్కడ కనబడని కంపెనీ పేర్లతో ఉన్న ఎరువులు అంటగడుతున్నారు. కారణం వీటిపై ఎక్కువ లాభాలు వస్తుండటంతో వాటినే విక్రయిస్తున్నారు. ఈ నాసిరకం ఎరువులు వాడిన అన్నదాతలు చేను ఎదకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి నకిలీ ఎరువులు, పురుగుమందులు విక్రయిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
నకిలీ ఎరువులు విక్రయిస్తే చర్యలు
మండలంలో నకిలీ ఎరువులు విక్రయిస్తున్నట్లు మా దృష్టికి ఇంత వరకు రాలేదు. మా పరిశీలనలో తేలితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. –వెంకట్రావమ్మ,
మండల వ్యవసాయ అధికారి

నకిలీ ఎరువుల కలకలం

నకిలీ ఎరువుల కలకలం